సీనియర్‌ పాత్రికేయుడు శ్రీరంగనాథ్‌ మృతి

9 Feb, 2022 08:42 IST|Sakshi

సాక్షి, అమరావతి/అమలాపురం: కోనసీమకు చెందిన సీనియర్‌ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (78) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన శ్రీరంగనాథ్‌ పాత్రికేయ ప్రస్థానం నాలుగు దశాబ్దాల పాటు సాగింది.

శ్రీరంగనాథ్‌ ఉదయం దిన పత్రిక స్టాఫ్‌ రిపోర్టర్‌గా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఉదయం స్టేట్‌ బ్యూరోలో కూడా పనిచేశారు. వార్త దిన పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా, ఏపీ టైమ్స్‌ ఆంగ్ల పత్రిక బ్యూరో చీఫ్‌గా, ఆంధ్రప్రభ దినపత్రిక న్యూస్‌ నెట్‌ వర్క్‌ ఇన్‌ఛార్జిగా, సాక్షి దినపత్రిక కాలమిస్ట్‌గా పనిచేశారు.

కమ్యూనిస్ట్‌ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ఇండియా మార్ట్‌గేజ్డ్‌ పుస్తకాన్ని తెలుగులో శ్రీరంగనాథ్‌ తాకట్టులో భారతదేశం పేరుతో అనువదించారు. శ్రీరంగనాథ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి.

సీఎం సంతాపం
శ్రీరంగనాథ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీరంగనాథ్‌ మృతి పత్రికా లోకానికి తీరని లోటని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జీవితాంతం బలమైన వామపక్ష రాజకీయ దృక్పథాన్ని ఆచరిస్తూ.. నీటిపారుదల రంగంలో డెల్టా వ్యవస్థ మెరుగుదలపై అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారని కొనియాడారు.

మంగళవారం శ్రీరంగనాథ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీరంగనాథ్‌ ఎంతో మంది జర్నలిస్టులను సమాజానికి అందించారన్నారు.

మరిన్ని వార్తలు