సీనియర్‌ జర్నలిస్టు ‘తుర్లపాటి’ కన్నుమూత 

12 Jan, 2021 04:33 IST|Sakshi

ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి 

రాష్ట్రంలో ‘పద్మశ్రీ’ పొందిన తొలి పాత్రికేయులు 

సభాధ్యక్షతలో గిన్నిస్‌ రికార్డు 

గవర్నర్, సీఎం సహా పలువురు ప్రముఖుల సంతాపం

లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి : సీనియర్‌ పాత్రికేయులు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే తుదిశ్వాస వదిలారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. 1933 ఆగస్టు 10న కృష్ణాజిల్లాలో జన్మించిన ఆయన, 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఏడు దశాబ్దాలపాటు ఆయన పాత్రికేయునిగా, రచయితగా వివిధ హోదాల్లో పనిచేశారు.  

విలువలకు పెద్దపీట 
పాత్రికేయునిగా ‘తుర్లపాటి’ విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని, నేటి తరానికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని పలువురు స్మరించుకుంటున్నారు. రాష్ట్రంలోనే పద్మశ్రీ అవార్డు పొందిన తొలి జర్నలిస్టు ఆయనే కావడం విశేషం. తెలుగు జర్నలిజం, సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని కృషితో అనేక అవార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ప్రముఖులు రాజాజీ, డాక్టర్‌ ఎస్‌ రాధాకృష్ణన్, వీవీ గిరి, పీవీ నరసింహారావు వంటి వారితో తుర్లపాటికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం వివిధ హోదాల్లో 33 ఏళ్లపాటు ఆంధ్రజ్యోతి పత్రికలోనే కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన రచనలు జాతక కథలు (1958), జాతి నిర్మాతలు (1968), మహానాయకులు (1971), 1857 విప్లవ వీరులు, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం–నా గళం వంటివి ప్రజాదరణ పొందాయి.  

గిన్నిస్‌ రికార్డుల్లో చోటు 
ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే తుర్లపాటి కుటుంబరావు.. 20 వేలకు పైచిలుకు సభల్లో పాల్గొన్నారు. అంతేకాక.. వేలాది సభలకు అధ్యక్షత వహించి 1993లో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌లో స్థానం పొందారు. తానా ఆహ్వానం మేరకు 1985 లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన తెలుగు సభల్లో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొన్నారు.  

గవర్నర్‌ విశ్వభూషణ్‌ సంతాపం 
తుర్లపాటి మృతిపట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు వేలకు పైగా జీవిత చరిత్రలు రాయటమే కాక, వేలాది ప్రసంగాలతో గిన్నీస్‌ రికార్డుల్లో స్థానం పొందారని కొనియాడారు. కుటుంబరావు ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 

బహుముఖ ప్రజ్ఞాశీలి తుర్లపాటి : సీఎం జగన్‌ 
ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత, గొప్ప వక్త తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొప్ప రచయిత, మంచి వక్త, బహుముఖ ప్రజ్ఞాశీలి అని తుర్లపాటిని ముఖ్యమంత్రి కొనియడారు. ఆయన అనేక అవార్డులు గెలుచుకున్నారని.. తెలుగు సాహిత్యం, జర్నలిజానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పదని సీఎం తెలిపారు. అలాగే, మంత్రి పేర్ని నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు జర్నలిస్టులు కూడా తుర్లపాటి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తుర్లపాటి కుటుంబరావు భార్య కృష్ణకుమారి 1969లోనే మృతిచెందారు. ఆయన తనయుడు టీవీఎస్‌ జవహర్‌లాల్‌ విజయవాడలోనే క్రెడాయ్‌ సంస్థలో సీఈవోగా పనిచేస్తున్నారు. కుమార్తె ప్రేమజ్యోతి పదేళ్ల కిందట మృతిచెందారు.  

మరిన్ని వార్తలు