AP High Court: పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ చెల్లవు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

17 Jul, 2022 11:55 IST|Sakshi

వాటి ఆధారంగా రౌడీషీట్లు తెరవడం, కొనసాగించడం చేయరాదు

వ్యక్తుల సమాచార సేకరణ, నిఘా పెట్టడానికి కూడా వీల్లేదు

ఇలాంటి చర్యలన్నీ గోప్యత హక్కుకు భంగం కలిగించేవే

అది రాజ్యాంగ ఉల్లంఘన కూడా

ఇక నుంచి పోలీసులు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను అనుసరించరాదు

ఒకవేళ ప్రభుత్వం అలా చేయాలనుకుంటే చట్టాన్ని సవరించాల్సిందే

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు సంచలన తీర్పు 

సాక్షి, అమరావతి: రౌడీ షీట్లు తెరవడం.. కొనసాగించడం... రౌడీలుగా ప్రకటించడం..  వ్యక్తులపై నిఘా తదితర విషయాల్లో హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (పీఎస్‌వో) / పోలీసు మాన్యువల్‌ ప్రకారం రౌడీషీట్, సస్పెక్ట్‌ షీట్, హిస్టరీ షీట్‌ లాంటివి తెరవడం చెల్లదని స్పష్టం చేసింది. పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది.

పీఎస్‌ఓ ప్రకారం ఫోటోల సేకరణ, వాటిని స్టేషన్లలో ప్రదర్శించడం, ఇళ్లను సందర్శించడం, స్టేషన్‌కు పిలిపించడం, స్టేషన్‌లో గంటల పాటు వేచి ఉండేలా చేయడం తదితరాలన్నీ వ్యక్తుల గోప్యత హక్కుకు విఘాతం కలిగించేవేనని పేర్కొంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అనే తెలిపింది. పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం ఇలాంటి పనులు చేయడం, వ్యక్తులపై అనుచిత నిఘా పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం 42 పేజీల తీర్పు వెలువరించారు. 

సుప్రీం తీర్పును ఉల్లంఘించడమే..
‘చట్టపరమైన నియమ, నిబంధనలను పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ అధిగమించలేవు. పోలీసులకు సీఆర్‌పీసీ, ఐపీసీ ప్రసాదించిన హక్కులను పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ కల్పించడం లేదు. ఇవి కేవలం మార్గదర్శకాలు, విధి విధానాలు మాత్రమే. వీటికి ఎలాంటి చట్టబద్ధమైన బలం లేదు. అవి కేవలం శాఖాపరమైన సూచనలు మాత్రమే. పోలీసు చట్టం లేదా ఇతర ఏ చట్టం కింద పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను రూపొందించలేదు. చట్టబద్ధత లేని పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను రౌడీషీట్లు తెరవడానికి, కొనసాగించడానికి, తెరిచిన వాటిని సమర్థించుకోవడానికి ఉపయోగించేందుకు ఎంత మాత్రం వీల్లేదు. అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది.

ఒకవేళ కొనసాగిస్తే ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులు కాని అధికారులు సైతం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లే అవుతుందని హెచ్చరించింది. పిటిషనర్లపై తెరిచిన రౌడీషీట్లన్నింటినీ మూసివేయాలని పోలీసులను ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం నేరాలు జరగకుండా ముందస్తుగానే నివారించేందుకు సమాచార సేకరణ, నిఘా వేయాలనుకుంటే అందుకు అనుగుణంగా వీలైనంత త్వరగా చట్ట ప్రకారం నిబంధనలు రూపొందించడం, చట్ట సవరణ చేపట్టడం చేయాలని పేర్కొంది.

ఈ విషయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నేరాలను నివారించేందుకు పోలీసులకు సీఆర్‌పీసీ ప్రకారం చర్యలు తీసుకునేందుకు పలు ప్రత్యామ్నాయాలున్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులు రౌడీషీట్లు తెరవడం, కేసులు కొట్టివేసినా వాటిని కొనసాగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాదాపు 57 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

గోప్యత ప్రాథమిక హక్కు...
‘గోప్యత ప్రాథమిక హక్కు అని కేఎస్‌ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు మైలురాయి లాంటి తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ కోర్టు ముందుకొచ్చిన వ్యాజ్యాల్లో పిటిషనర్లు తమ ప్రాథమిక హక్కులకు పోలీసులు కలిగిస్తున్న విఘాతం గురించి ప్రస్తావించారు. తరచూ తమ ఇళ్లకు రావడం, స్టేషన్లలో ఫోటోలు ప్రదర్శించడం, స్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి వేచి ఉండేలా చేయడం, రౌడీలనే ముద్ర వేయడం లాంటివి చేస్తున్నట్లు నివేదించారు.

రౌడీషీట్‌ పెండింగ్‌లో ఉందనే కారణంతో పాస్‌పోర్టు ఇవ్వడం లేదని, చిన్న నేరం చేసిన వారిని కూడా తరచూ నేరాలు చేసే వారిగా ముద్ర వేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటిని బట్టి పీఎస్‌వో అమలు సమయంలో పోలీసులు బుర్ర ఉపయోగించకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది’ అని జస్టిస్‌ సోమయాజులు తీర్పులో పేర్కొన్నారు.

సీఆర్‌పీసీలో ఎన్నో వెసులుబాట్లు...
‘నేరం చేసే వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించాలి? శాంతికి విఘాతం కలిగించే వారి పట్ల ఎలా వ్యవహరించాలి? ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనే విషయాలను సీఆర్‌పీసీ సెక్షన్లు 107, 109 స్పష్టంగా చెబుతున్నాయి. పదే పదే నేరం చేసే వారిపై సంబంధిత చట్టం కింద కేసులు పెట్టొచ్చు. పోలీసులు వారి వేలిముద్రలు, ఫోటోలు, చేతిముద్రలు, కాలిముద్రలు సేకరించవచ్చు. కదలికలపై పరిమితులు విధించొచ్చు. ఇలాంటి సౌలభ్యాలు, వెలుసుబాట్లు సీఆర్‌పీసీలో ఎన్నో ఉన్నాయి. నిఘా పెట్టడం, సమాచారం సేకరించడం లాంటి వాటిని కొనసాగించాలంటే చట్టాన్ని సవరించడమే సరైన విధానం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

కోర్టులు ఆదేశించినా తీరు మారట్లేదు..
సుప్రీంకోర్టు మొదలు హైకోర్టు వరకు పలు సందర్భాల్లో విస్పష్టమైన తీర్పులిచ్చినా పోలీసులు ఇప్పటికీ రౌడీషీట్లు తెరుస్తూనే ఉన్నారు. విధి విధానాల పరమైన లోపాలున్నాయని పదేపదే చెబుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. తగిన కారణాలు, విశ్వసనీయమైన ఆధారాలు లేకుండా పలువురిపై రౌడీలుగా ముద్ర వేస్తున్నారు. లోక్‌ అదాలత్‌ల్లో రాజీ చేసుకున్న కేసుల్లో కూడా పోలీసులు రౌడీషీట్లు కొనసాగిస్తున్నారు. ఆయా వ్యక్తులపై కోర్టులు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసినా రౌడీషీట్లు కొనసాగిస్తూనే ఉన్నారు’ అని న్యాయమూర్తి తీర్పులో ఆక్షేపించారు.

చట్టం నిర్దేశించిన మార్గాల్లో..
‘నిఘా, రౌడీషీట్లు తెరవడాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థిస్తున్నారు. సమాచార సేకరణ లాంటివి నేరం జరగడానికి ముందే నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాన్ని ఈ కోర్టు విస్మరించడం లేదు. దశాబ్దాల తరబడి పోలీసులు పీఎస్‌వో విధానాన్ని అమలు చేస్తూనే ఉన్నారు. అయితే నేరాన్ని జరగకుండా నివారించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు చట్టం నిర్దేశించిన పరీక్షను దాటలేకపోయాయి.

చట్టం నిర్దేశించిన మార్గాల్లో సాధారణ నిఘా, సమాచార సేకరణను ఏ చట్టం కూడా నిషేధించడం లేదు. నేరం జరగకుండా నివారించేందుకు ఇవి అవసరం. అయితే విచక్షణారహితంగా సమాచార సేకరణ, రాత్రిపూట ఇళ్ల సందర్శన, తరచూ పోలీస్‌స్టేషన్‌కు పిలవడం, స్టేషన్‌లో ఫోటోలు ప్రదర్శించడం లాంటివే ప్రధాన సమస్యలు.

పుట్టుస్వామి కేసు ఆధారంగా పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను రద్దు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాది కోరుతున్నారు. ఈ అభ్యర్థన సరైంది కాదని నా అభిప్రాయం. పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు సమాచార భద్రత, ఆధార్‌ కార్డు గురించి మాత్రమే చర్చించలేదు. వ్యక్తి గోప్యత గురించి సవివరంగా చర్చించి, గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ప్రస్తుతానికి చట్టం కూడా ఇదే’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. 

మరిన్ని వార్తలు