కరోనా వచ్చినట్టే తెలియదు..

11 Sep, 2020 06:44 IST|Sakshi

వైరస్‌ సోకిన లక్షణాలే లేవు

సగటున 19.7 శాతం మందిలో యాంటీబాడీస్‌ వృద్ధి

విజయనగరంలో అత్యధికంగా 30.6%

మహిళల్లోనే ఎక్కువగా యాంటీబాడీస్‌

 9 జిల్లాల్లో సీరో సర్వైలెన్స్‌  తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలువురికి కరోనా సోకినట్లుగానీ, వైరస్‌ ప్రభావం ఉన్నట్లు గానీ తెలియకుండానే సురక్షితంగా బయటపడినట్లు వెల్లడైంది. తాజాగా 9 జిల్లాల్లో సీరో సర్వైలెన్స్‌ (యాంటీబాడీస్‌ వృద్ధి వివరాలు) సర్వే నిర్వహించగా ఆ నివేదికను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ గురువారం మీడియాకు వివరించారు. 

రాష్ట్రంలో గతంలో తూర్పు గోదావరి, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఆగస్ట్‌ 26 నుంచి 31 వరకు సర్వే నిర్వహించారు. తాజాగా 9 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 19.7 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్టు తేలింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 30.6 శాతం మందిలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్లు గుర్తించారు. కర్నూలులో 28.1 శాతం మందిలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయి.
చిత్తూరు జిల్లాలో ఐదు వేల మందిని పరీక్షించగా 20.8 శాతం మందిలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్లు గుర్తించారు. అంటే వీరంతా మహమ్మారి సోకినట్లు తెలియకుండానే కోలుకున్నారు. వీరిలో ఎలాంటి వైరస్‌ లక్షణాలు కనిపించలేదు. 
9 జిల్లాల్లో 5 వేల చొప్పున నమూనాలు సేకరించి సర్వే నిర్వహించారు
కంటైన్మెంట్, నాన్‌ కంటైన్మెంట్, హైరిస్క్‌ ఏరియాల్లో సర్వే నిర్వహించారు

(చదవండి: ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్‌)

సర్వే ఫలితాలతో కేసులపై అంచనా
తాజాగా సీరో సర్వైలెన్స్‌ ఫలితాలను బట్టి కేసులు ఎక్కడ తగ్గవచ్చు? ఎక్కడ పెరగవచ్చు? అనే విషయంపై ఓ అంచనాకు రావచ్చు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టవచ్చు. పశ్చిమతో పాటు మరికొన్ని జిల్లాల్లో పీక్‌ దశ నడుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ప్రభుత్వం పారదర్శకంగా కోవిడ్‌ నియంత్రణ చర్యలు చేపడుతోంది. కొంతమంది తమకు నచ్చినట్టు అన్వయించుకుని వార్తలు రాయడం దురదృష్టకరం. 
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ 

మరిన్ని వార్తలు