1వ తేదీనే రూ.1,335.78 కోట్ల పంపిణీ 

2 Jul, 2022 05:16 IST|Sakshi
విజయవాడ ఏకలవ్య నగర్‌లో ఎల్‌.నరసమ్మకు వృద్ధాప్య పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌ ఎం.శైలజ

52.61 లక్షలమంది పింఛనుదారులకు అందిన డబ్బు

తొలిరోజే 86.92 శాతం మందికి పంపిణీ పూర్తి

సాక్షి, అమరావతి: అవ్వాతాతలు సహా రాష్ట్రంలోని పింఛను లబ్ధిదారులకు ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. తొలిరోజే 52,61,143 మందికి రూ. 1,335.78 కోట్లను  అందజేశారు. మొదటిరోజే 86.92% మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో మరో నాలుగు రోజులు పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తన స్వగ్రామం అనకాపల్లి జిల్లా తారువలో వృద్ధులకు పింఛన్లు అందజేశారు. 

ఆస్పత్రికి వెళ్లి పింఛన్‌ పంపిణీ
కడప రూరల్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు పింఛను అందజేశారు వైఎస్సార్‌ జిల్లా కడపకు చెందిన వలంటీరు గాయత్రి. కడప నగరంలోని ఎస్‌ఎఫ్‌సీ స్ట్రీట్‌కు చెందిన శ్రీదేవి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీరు గాయత్రి ఆస్పత్రికి వెళ్లి శ్రీదేవికి పింఛను అందజేశారు. దీంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన శ్రీదేవి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

రుయాలో చికిత్స పొందుతున్న వృద్ధుడికి.. 
చంద్రగిరి: చంద్రగిరి మండలం ఐతేపల్లికి చెందిన వృద్ధుడు నాగయ్య అనారోగ్యంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్‌ ఫాజిలా, వలంటీర్‌ స్వర్ణ రుయా ఆస్పత్రికి వెళ్లి నాగయ్యకు పింఛను డబ్బు అందజేశారు.


 

మరిన్ని వార్తలు