Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ

25 Jul, 2021 10:51 IST|Sakshi

25 ఏళ్లుగా వెళ్లి వస్తున్న బృందాలు 

వెలుగులోకి వింతలు, విశేషాలు

కొండా కోనల్లో సరికొత్త అనుభవాలు 

ప్రకృతితో మమేకమై నడక 

సాక్షి, చిత్తూరు: ఉరుకులు పరుగుల జీవితం. కాంక్రీటు వనాల్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైన పని. ఒకేచోట నివసిస్తున్నామనే మాటే కానీ.. నోరు విప్పి  మాట్లాడుకోలేని పరిస్థితి. పక్కింట్లో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేనంతగా మనిషి మారిపోతున్నాడంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతూ.. ఆయుష్షు క్షీణిస్తోంది. రోజంతా కష్టపడినా.. సాయంత్రానికి కష్టసుఖాలు పంచుకునే స్నేహితులు ఉంటే జీవితంలో అంతకు మించిన సుఖం మరొకటి లేదనేది వాస్తవం. కనీసం వారంలో ఒక్క రోజైనా స్నేహితులు, బంధువులతో కలిస్తే.. మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ సంతోషమే సగం బలం. ఇలా కలవాలనుకునే వారిని ఒక్కటి చేస్తోంది ‘ట్రెక్కింగ్‌’. ఆ విశేషాల సమాహారమే ఈవారం ‘సాక్షి’ సండే స్పెషల్‌..

రొటీన్‌ జీవితానికి భిన్నంగా ఆటవిడుపు కోసం అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలో వీకెండ్‌లో పర్వతారోహణం చేస్తుంటారు. భారత దేశంలో పర్యటన పూర్తిగా మతంతో ముడిపడి ఉంటుంది. తీర్థయాత్రలు, యాత్రలు ఉంటాయి. ఇందుకు భిన్నంగా తిరుపతికి చెందిన బీవీ రమణ, పున్నా కృష్ణమూర్తి, ఈశ్వరయ్య 25 ఏళ్ల క్రితం అడవిలో చెట్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్లడం ఆరంభించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, లోయలు, సెలయేళ్లు, నీటి ప్రవాహాలు, ఆ నీటి ప్రవాహ ఒరిపిడికి ఏర్పడిన శిలా రూపాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తరువాత శ్వేత మాజీ డైరెక్టర్‌ భూమన్‌(74), సీనియర్‌ జర్నలిస్ట్‌ రాఘవశర్మ(70), మధు(స్విమ్స్‌లో డయాలసిస్‌ టెక్నీషియన్‌), యుగంధర్, ట్రెక్కింగ్‌ బాలసుబ్రమణ్యం గ్రూపులుగా ఏర్పడి ప్రతి ఆదివారం ట్రెక్కింగ్‌కు వెళ్లి వస్తున్నారు.

మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు భూమన అభినయ్‌రెడ్డి మిత్ర బృందం సభ్యులు మరో గ్రూపుగా ఏర్పడి ట్రెక్కింగ్‌ను ఆస్వా దిస్తున్నారు. 1997లో జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి విజయవాడ నుంచి తిరుపతికి బదిలీపై వచ్చి.. విధులు ముగించుకుని అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఆ తరువాత స్థానిక ఉద్యోగి బీవీ రమణతో కలిసి శేషాచలంలో అన్వేషణ ప్రారంభించారు. ఇలా ట్రెక్కింగ్‌కు బీజం పడింది. 

ఆషామాషీ కాదు.. 
ట్రెక్కింగ్‌ అనేది ఆషామాషీ కాదు. సాహసంతో కూడుకున్న యాత్ర. చెప్పాలంటే మిలిటరీలో ట్రైనింగ్‌ లాంటిది. తాళ్లు, ట్యూబ్స్, టెంట్లు, నీరు, భోజనం, పండ్లు, బిస్కెట్స్‌ తీసుకుని నిట్టనిలువుగా ఉండే కొండలు, గుట్టలు ఎక్కడం సరికొత్త అనుభూతి. ఒక్కొక్కరు కనీసం 20 నుంచి 30 కిలోల బరువు మోసుకెళ్లాల్సి వస్తుంది. 25 ట్రెక్కింగ్‌ గ్రూపుల్లో కొందరు 100 నుంచి 200 సార్లు కొండా కోనల్లో తిరిగిరావటం ఆశ్చర్యం కలిగిస్తోంది.


ట్రెక్కింగ్‌తో లాభాలు 

ఫిట్‌నెస్‌కు, కష్టానికి శరీరం అలవాటు పడుతుంది. 
 శరీరాన్ని ఎలా అయినా తిప్పేందుకు వీలు కలుగుతుంది. 
 సమష్టితత్వం అలవడుతుంది. 
 ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం నేర్పుతుంది. 
 నడవలేని వారికి చేయి అందించడం, లేదా మోసుకెళ్లడం ద్వారా పరోపకారాన్ని తెలియజేస్తుంది. 
 అడవిలో మంచి ఆక్సిజన్‌ పీల్చుకోవడం  వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. 
కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఎదుర్కొనేలా మానసిక దృఢత్వం. 

పక్కా ప్రణాళికతో..

ట్రెక్కింగ్‌కు వారం ముందే ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. 
►  ఏ అడవికి వెళ్లాలి, అక్కడకు ఎన్ని కిలోమీటర్లు? దారి ఎలా ఉంటుంది? అందుకు సంబంధించిన ఏర్పాట్లు. 
► ట్రెక్కింగ్‌లో భాగస్వాములయ్యే సభ్యులతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవడం. 
►  ఎలాంటి సమాచారమైన అందులోనే చర్చించుకోవడం. లొకేషన్‌ షేరింగ్‌. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి 

► ట్రెక్కింగ్‌కు వెళ్లేవారు వేకువజామునే లేచి ఎంపిక చేసుకున్న ప్రాంతానికి ఉదయం 6–7 గంటల మధ్య చేరుకోవాలి. 
► ప్రతి సభ్యుడు ఒక బ్యాగు, అందులో 2, 3 నీళ్ల బాటిల్స్, స్నాక్స్, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకెళ్లాలి.  
► కొండలు, గుట్టలు ఎక్కేందుకు వీలుగా కాటన్‌ దుస్తులు ధరించాలి. విధిగా షూ ధరించాలి. 
► మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందస్తు ఏర్పాట్లు. 
► ఎంపిక చేసుకున్న ప్రాంతానికి వెళ్లే కంటే ముందు సమీపంలోని గ్రామాల ప్రజలతో మమేకం కావడం. 

ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం 
నేను 30 ఏళ్లకు ముందే ట్రెక్కింగ్‌ మొదలు పెట్టాను. ఇప్పటి వరకు సుమారు 200 ట్రెక్కింగ్‌లు చేసుంటా. నాతోపాటు ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు అందరినీ తీసుకెళ్తుంటా. నా భార్యను కూడా ట్రెక్కింగ్‌లో భాగస్వామిని చేశా. ప్రకృతి ఒడిలోకి వెళ్తే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేం. జీవవైవిధ్యంతో పాటు జంతువులు, అనేక రకాల మొక్కలు, పూల మధ్య గడపడం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. 
– భూమన్, శ్వేత మాజీ డైరెక్టర్‌ 

పెద్ద పులిని చూసి షాక్‌ అయ్యాం 
2006లో తలకోన నుంచి సుమారు 30 కి.మీ దూరంలో రుద్రగళతీర్థం వరకు వెళ్లాం. ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేశాం. రాత్రి 10 గంటల సమయంలో కణితి అరుపులు వినిపించాయి. ఇది మామూలే అనుకున్నాం. 15 నిమిషాల తర్వాత పెద్దపులి గాడ్రింపుతో భయమేసింది. ఆ పెద్దపులి కణితి గొంతును పట్టుకుని ఈడ్చుకెళ్తుండడం చూసి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఆ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ చప్పుడు చేయకుండా ఉండిపోయాం.     
– కుమార రాధాకృష్ణ, కృష్ణాపురం, రాత్రి విగ్రహాల శిల్పి

మరిన్ని వార్తలు