‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కాపులకు ఓ వరం 

25 Aug, 2022 04:24 IST|Sakshi

మూడేళ్లలో కాపుల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేశాం 

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ శేషగిరి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు విదేశాలలో ఉన్నత చదువులు చదువుకునేందుకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం’ ఒక వరమని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి చెప్పారు. ఆయన బుధవారం మంగళగిరి కాపు కార్పొరేషన్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాపు సామాజికవర్గంలో వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కలలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. రూ. 8 లక్షల లోపు వార్షికాదాయం ఉండి, విదేశీ విద్యార్హత పరీక్షలో స్కోరు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఈ పథకం ద్వారా విదేశాలలో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ చదవొచ్చని తెలిపారు. ప్రపంచంలో 1 నుంచి 100 ర్యాంకుల్లోని యూనివర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు 100 శాతం ట్యూషన్‌ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని, 200 వరకు ర్యాంకుల్లో ఉన్న వర్సిటీలకు ఎంపికైన వారికి రూ.50 లక్షలు, లేదా ట్యూషన్‌ ఫీజులో 50 శాతం చెల్లిస్తుందని వివరించారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందన్నారు.

అర్హత గలవారు సెప్టెంబర్‌ 30వ తేదీలోపు http:// jnanabhumi. ap. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి 63054 48393, 63051 59559 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో కాపుల సంక్షేమానికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.32 వేల కోట్లు,  కాపు నేస్తం కింద మహిళలకు రూ.1,500 కోట్లు అందించామని తెలిపారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా త్వరలో రుణాలు ఇస్తామన్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లో కాపు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని చెప్పారు.   

మరిన్ని వార్తలు