రిజిస్ట్రేషన్లూ ఆన్‌లైన్‌లోనే.. కర్నూలుకు ప్రీమియం రిజిస్ట్రేషన్‌ సెంటర్‌ 

22 Dec, 2022 11:05 IST|Sakshi

పైలట్‌ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, శ్రీకాకుళంలలో విజయవంతం 

పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో అత్యాధునిక రిజిస్ట్రేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు సర్కార్‌ చర్యలు 

అవినీతి, డాక్యుమెంట్‌ రైటర్లు, మధ్యవర్తులకు స్వస్తి ∙స్లాట్‌ విధానం, సింగిల్‌ విండో రిజిస్ట్రేషన్‌

ఆస్తుల క్రయ, విక్రయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి. డాక్యుమెంట్‌ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయమూ ఎక్కువే. వీటన్నింటికీ చెక్‌ పెడుతూ ప్రజలకు సులభంగా.. అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రీమియం రిరిజిస్ట్రేషన్‌ సర్వీసు సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా పాసుపోర్టు సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్‌ స్థాయి హంగులతో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

సాక్షి, కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్రంలో మొత్తం 9 ప్రీమియం రిజిస్ట్రేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్‌ అండ్‌స్టాంప్స్‌ శాఖ నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్‌ ప్రాజెక్టుగా మొదట విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రీమియం రిజస్ట్రేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.

అక్కడ సేవలు విజయవంతం కావడంతో మిగిలిన ఏడు చోట్ల ప్రీమి యం రిజిస్ట్రేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కర్నూలులో ప్రీమియం రిజిస్ట్రేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ అధికారులు కర్నూలు నగరంలో ప్రజలకు అనువైన ప్రాంతం, 1,000 చదరపు అడుగుల భవనం కోసం అన్వేషణ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి నుంచి ప్రీమియం రిజిస్ట్రేషన్‌ సెంటర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు..  
ప్రీమియం రిజిస్ట్రేషన్‌ సెంటర్‌ ఫ్రంట్‌ ఎండ్‌లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది, డేటా ఎంట్రీ అపరేటర్లు ఉంటారు. బ్యాక్‌ ఎండ్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌, ఇతర సిబ్బంది ఉండి పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్‌ సేవలు అందించినా..  తర్వాత అన్ని ఆన్‌లైన్‌ సేవలే ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. అంతేకాక ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్‌విండో కింద రిక్వెస్టు పెడితే ఆన్‌లైన్‌లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినయోగదారులే తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అప్పుడు ఆన్‌లైన్‌లోనే సబ్‌ రిజిస్ట్రార్‌కి వెళ్తుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించి ఆధార్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. అనంతరం ఆస్తుల వివరాలను పరిశీలించి సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్‌ రైటర్ల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెస్సేజ్‌  వెళ్తుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్‌ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే  జరుగుతాయి.  

అవినీతికి తావుండదు 
అవినీతి రహిత రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ముఖ్య ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్‌ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.  
– కల్యాణి, డీఐజీ, రిజిస్ట్రేషన్‌ అండ్‌స్టాంప్స్‌    

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు