ప్రతి 5 నిమిషాలకు ఏడుగురి జననం

15 Feb, 2021 04:07 IST|Sakshi

రాష్ట్రంలో గత పది నెలల్లో బాహ్య ప్రపంచంలోకి 6,03,977 మంది శిశువులు

రోజుకు సగటున 2,013 మంది పుట్టుక

ప్రభుత్వాసుపత్రుల్లో 40.70 శాతం ప్రసవాలు 

పుట్టిన తొలి గంటలోనే శిశువుకు పాలు ఇస్తున్న తల్లులు 97.68 శాతం

25 వేల మందికి పైగా బరువు తక్కువ చిన్నారులు

వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలో తల్లులకు అవగాహన

వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాల్లో వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఐదు నిమిషాలకు ఏడుగురు శిశువులు కొత్త ప్రపంచానికి పరిచయమవుతున్నారు. అంటే నిమిషానికి 1.39 మంది పుడుతున్నట్టు లెక్క. సగటున రోజుకు 2,013 మంది జనాభా లెక్కల్లోకి ఎక్కుతున్నట్టు తాజా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే గడిచిన 10 నెలల్లో 6,03,977 మంది శిశువులు రాష్ట్రంలో జన్మించారు. వీళ్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జనన నమోదు పత్రాలు ఇచ్చారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో శిశువులు పుడుతున్నట్టు తేలింది. 6,03,977 ప్రసవాల్లో ఆస్పత్రుల్లో జరిగినవి 6,01,652. అంటే 99.85 శాతం మంది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో పుట్టిన వారే.  ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన వారు 2,44,876 మంది (40.70 శాతం) ఉన్నారు. మిగతా 59.30 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు. 

25 వేల మందికి పైగా బరువు తక్కువ
6,03,977 మంది శిశువుల్లో 25,451 మంది 2 కేజీలు.. అంతకంటే తక్కువ బరువుతో పుట్టినట్టు గణాంకాల్లో వెల్లడైంది. ఇలాంటి బరువు తక్కువ పిల్లలు కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. చాలా మంది తల్లులు ప్రసవం అయిన గంటలోగానే తల్లిపాలు బిడ్డకు పడుతున్నారు. మొత్తం ప్రసవాల్లో 97.68 శాతం మంది తల్లులు శిశువు పుట్టిన గంటలోపే పాలు పడుతున్నారు. దీనివల్ల బిడ్డకు అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 95.86 శాతం మంది తల్లులు తమ బిడ్డకు బీసీజీ, పోలియో, తట్టు తదితర వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నట్టు వెల్లడైంది. 

మరిన్ని వార్తలు