నీట మునిగి ఏడుగురు మృత్యువాత

2 Mar, 2022 05:12 IST|Sakshi

సంపరలో పుణ్యస్నానానికి వెళ్లి కొట్టుకుపోయిన ఇద్దరు 

మద్దిగెడ్డ జలాశయంలో మునిగి మరో ఇద్దరు 

గుండ్లకమ్మ నదిలో స్నానానికి దిగి మరో ముగ్గురు 

తెలుగు గంగ కాలువలో ఇద్దరు గల్లంతు 

తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పండుగపూట విషాదం

పెదపూడి/అడ్డతీగల/వినుకొండ/వెంకటగిరి రూరల్‌: తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు దుర్ఘటనల్లో నీట మునిగి ఏడుగురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపరలో శివరాత్రి సందర్భంగా ఇద్దరు యువకులు కాలువలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునిగి మృతి చెందారు. కరప గ్రామానికి చెందిన పేపకాయల అజయ్‌ (19), గొల్లపల్లి యశ్వంత్‌ (20) శహపురానికి చెందిన కరెడ్ల మణికంఠ స్నేహితులు.

ఈ ముగ్గురూ మరికొందరితో కలిసి ముక్తేశ్వరస్వామి ఆలయ సమీపాన గల తుల్యభాగ నదీపాయ కాలువలో మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రవాహ ఉధృతికి అజయ్, యశ్వంత్‌ నీట మునగ్గా.. మణికంఠ అదృష్టవశాత్తూ పైకి తేలి ఒడ్డుకు చేరుకున్నాడు. స్థానికులు కాలువలోకి దూకి కొనఊపిరితో ఉన్న యశ్వంత్‌ను బయటకు తీసి పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే యశ్వంత్‌ మృతి చెందగా.. మరికొంత సేపటికి అజయ్‌ మృతదేహం బయటపడినట్లు పెదపూడి ఎస్‌ఐ పి.వాసు తెలిపారు. ఇలా ఉండగా, అడ్డతీగల శివారున మద్దిగెడ్డ జలాశయం ప్రధాన పంట కాలువలో పడి మరో ఇద్దరు మృతి చెందారు. అడ్డతీగల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బవురువాక గ్రామానికి చెందిన చెదల కల్యాణ్‌రామిరెడ్డి, 8వ తరగతి విద్యార్థి జనుమూరి సాయిరామ్‌ వీరేంద్రరెడ్డి మృతి చెందారు.  

మరో ఇద్దరు గల్లంతు 
కాగా, శివరాత్రి సందర్భంగా దైవదర్శనం చేసుకునేందుకు వెళ్లిన మాతంగి ప్రతాప్‌ (16), సర్వేపల్లి బాలాజీ (12) తెలుగు గంగ కాలువలో పడి గల్లంతయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జంగాలపల్లి తెలుగుగంగ కాలువ బ్రిడ్జి వద్ద మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట దళితవాడకు చెందిన మాతంగి ప్రతాప్‌ ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు, అదే ప్రాంతానికి చెందిన సర్వేపల్లి బాలాజీ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు.

శివరాత్రి  సందర్భంగా బంగారుపేట సమీపంలో ఉన్న జంగాలపల్లి వీరభద్రయ్యస్వామి ఆలయానికని మంగళవారం ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. ఆలయ సమీపంలోని తెలుగు గంగ కాలువ బ్రిడ్జి వద్ద కాలువలో ఈత కొట్టేందుకు దిగి నీటి ఉధృతికి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు చీకటి పడే వరకు గాలించినా ఫలితం దక్కలేదు. పండుగపూట విషాద ఘటనలు చోటుచేసుకోవడంతో 
ఆ కుటుంబాల్లో అంతులేని శోకం మిగిలింది.

సరదాగా గడిపేందుకు వచ్చి.. 
గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో స్నానానికి దిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వినుకొండకు చెందిన డ్రైవర్‌ మున్నీరు ఇంట్లో శుభకార్యానికి నరసరావుపేటకు చెందిన బంధువులు ఫైజుల్లాఖాన్, విజయవాడకు చెందిన ఆయేషా వచ్చారు. వీరితో కలిసి మున్నీరు కుటుంబం సరదాగా గుండ్లకమ్మ నది వద్దకు వెళ్లింది. అందరూ బ్రిడ్జి కింద కూర్చుని ఉండగా మున్నీరు కుమార్తె హీనా (19)తోపాటు ఎస్‌కే ఫైజుల్లాఖాన్‌ (17), ఆయేషా (19) స్నానానికని నదిలోకి దిగారు. లోతు అంచనా వేయలేకపోవడంతో ముగ్గురూ మునిగిపోయి మృత్యువాత పడ్డారు. వినుకొండ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

మరిన్ని వార్తలు