లోన్‌ యాప్‌ ఘటనలో ఏడుగురి అరెస్ట్‌

13 Sep, 2022 04:40 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌చార్జి ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి

5 రోజుల్లోనే అదుపులోకి నిందితులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లోన్‌ యాప్‌ వేధింపులకు బలైన దంపతుల సంఘటనలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో రుణ యాప్‌ బాధితులు పెరుగుతుండటంతో సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు. లోన్‌ యాప్‌లతో వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి, వారంలోనే నిందితుల్ని పట్టుకున్నారు.

స్థానిక దిశా పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం మీడియాకు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలిపారు. భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైన హాండీ లోన్, స్పీడ్‌ లోన్‌ యాప్‌లపై పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించి మూడు పోలీసు బృందాలు పనిచేశాయి. యాప్‌లకు, లోన్‌ తీసుకునే వారికి మధ్యవర్తులుగా పని చేస్తున్న వారిని గుర్తించారు.

తెలంగాణ రాష్ట్రం గండిపేట మండలం మానికొండకు చెందిన లంబాడీ నరేష్, మియాపూర్‌కు చెందిన కొల్లూరు శ్రీనివాస్‌యాదవ్, కాకినాడ జిల్లా తిమ్మాపురానికి చెందిన మేడిశెట్టి పృథ్వీరాజ్, ఏలేశ్వరానికి చెందిన నక్కా సుమంత్, అన్నవరానికి చెందిన మండా వీరవెంకటహరిబాబు, విశాఖ జిల్లా కేకే అగ్రహారానికి చెందిన కోరుపోలుత రామకృష్ణ, అనకాపల్లి సమీపంలోని సిరసపల్లికి చెందిన దానబోయిన భాస్కర్లు నిందితులని పోలీసులు గుర్తించారు.

వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా నెలలోనే రూ.కోటి లావాదేవీలు చేసినట్టు గుర్తించారు. బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా ప్రతి నెలా వేర్వేరు ఖాతాలను వీరు నిర్వహిస్తున్నారు. పోలీసులకు ఇతర రాష్ట్రాల్లోని యాప్‌ నిర్వాహకుల సమాచారం కూడా లభిం చడంతో ఆ దిశగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వర లోనే వీరిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.   

మరిన్ని వార్తలు