ఏడు వ్యాక్సిన్‌ వయల్స్‌ స్వాధీనం

23 May, 2021 04:56 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న వ్యాక్సిన్‌ వయల్స్‌

బ్లాక్‌లో విక్రయిస్తున్న ఆర్‌ఎంపీ 

సచివాలయ ఉద్యోగుల తనిఖీతో పరారీ 

దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

నరసరావుపేట: ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు కరోనా వ్యాక్సిన్‌లను అనధికారికంగా సంపాదించి బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సచివాలయ ఉద్యోగులు శనివారం దాడి చేసి ఏడు వ్యాక్సిన్‌ వయల్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ ఉదంతం జరిగింది. నరసరావుపేట వన్‌టౌన్‌ సీఐ కె.ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అరండల్‌పేటకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కె.శ్రీను కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లను వేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌కు సమాచారం అందింది.

ఆయన ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు నిఘా వేసి, అరండల్‌పేటలోని ఓ ఇంట్లో దాచిన ఏడు వ్యాక్సిన్‌ వయల్స్‌ అంటే డెబ్బై డోసుల వ్యాక్సిన్‌లను పట్టుకున్నారు. ఖాళీగా ఉన్న మరో ఐదు వయల్స్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో నిందితుడు పరారీ కాగా, అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో డోస్‌ను రూ.2 వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ కె.ప్రభాకరరావు ఆ వ్యాక్సిన్‌లను స్వాదీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు