కాకినాడ ప్యారీ షుగర్స్‌ పరిశ్రమలో పేలుడు.. ఇద్దరు మృతి

19 Aug, 2022 13:28 IST|Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా వాకలపూడిలోని ప్యారీ షుగర్స్‌ (ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెట్‌) పరిశ్రమలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు రాయుడు వీరవెంకట సత్యనారాయణ (35), వీరమళ్ళ రాజేశ్వరరావు(45) మృతిచెందారు. మరో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విదేశాల నుంచి ఓడలు ద్వారా కాకినాడ సీ పోర్టుకు ముడి సరుకును దిగుమతి చేసుకుని ఇక్కడ శుద్ధిచేసి బస్తాల్లో ప్యాకింగ్‌ చేసి తిరిగి విదేశాలకు పంపుతుంటారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం లోడింగ్‌ కోసం వచ్చిన జట్టు ఉ.9గంటల సమయంలో ఒక లారీని లోడుచేశారు.

మరో లారీలోకి సరుకు లోడు చేసేందుకు కన్వెయర్‌ బెల్ట్‌ పవర్‌ సప్లై కోసం ఎంసీబీ (మెయిన్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌) వద్ద సాకెట్‌లో వైర్లు కలిపి ఎంసీబీ ఆన్‌చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇలా పేలుడు రావడం.. మంటలు వ్యాపించడంతో సత్యనారాయణ శరీర భాగాలు ఛిద్రమై అక్కడికక్కడే మరణించాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా రాజేశ్వరరావు మృతిచెందాడు. మరోవైపు.. గాయపడిన వీరబాబు, గర్లంవల సూర్య సుబ్రహ్మణ్యం, మోరుకుర్తి జగన్నాథం, గండి వీరబాబులను ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో వీరబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతరుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఓవర్‌ లోడు విద్యుత్‌ సరఫరాతోనే ప్రమాదం?
ఎంసీబీ నుంచి ఒక్కసారిగా అధిక విద్యుత్‌ రావడంవల్లే మోటారు పేలిపోయి ఉంటుందని దీంతో కార్మికులు తీవ్రగాయాలపాలై ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికితోడు కాలే స్వభావం గల పంచదార కూడా మంటలకు ఆజ్యంపోసి ఉండవచ్చునంటున్నారు. కానీ, ప్రమాద కారణాలను విద్యుత్, అగ్ని మాపక సిబ్బంది చెప్పలేకపోవడం మిస్టరీగా మారింది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రమాద స్థలిని పరిశీలించి కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సంస్థ మేనేజరు ఎం.బాలాజీతోనూ చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సంఘటనపై అగ్నిమాపక, విద్యుత్‌ అధికారులతో విచారణ జరిపిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చెప్పారు. బాధ్యులుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సర్పవరం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. 

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే సానుభూతి
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. సీఎం వైస్‌ జగన్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, దీనిపై యాజమాన్యంతో మాట్లాడతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. 

రూ.40లక్షల చొప్పున పరిహారం
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ వంగా గీత చర్చలు జరపడంతో మృతుల కుటుంబాలకు రూ.40లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం అంగీకారం తెలిపింది. అలాగే, మృతుల కుటుంబాల్లో చదువుకున్న వారుంటే వారికి ఉద్యోగాలు.. కార్మికుల చట్టం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్‌ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు.. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులు, చికిత్స కాలానికి వేతనం కూడా ఇవ్వనున్నారు. 

ఇదీ చదవండి: షాకింగ్‌: ప్రియుడితో భార్య పరార్‌.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య

మరిన్ని వార్తలు