YS Rajasekhara Reddy: కరువు నేలపై పచ్చని సంతకం..

2 Sep, 2021 08:02 IST|Sakshi

కృష్ణమ్మ పరవళ్లు చూసి కరువు సీమ పులకించిపోయింది. తెలుగుగంగ వేగాన్ని చూసి బీడువారిన భూమితల్లికి జీవమొచ్చింది. కేసీ జలకళతో ఆయకట్టు పచ్చదనం సింగారించుకుంది. ఎగువ నుంచి వస్తున్న నీళ్లు.. దిగువ సగిలేటిలో జల సవ్వడులు.. వెరసి నలుదిక్కులా నీళ్లే కనిపిస్తున్నాయి. వరిమళ్లు.. కేపీ ఉల్లి పంటలతో పొలమంతా నిండిపోయింది. రైతు మనసంతా ఆనందంతో ఉప్పొంగిపోతోంది. కరువు రాతను మార్చేందుకు వైఎస్సార్‌ చేసిన ‘జలయజ్ఞం’ .. వైఎస్‌ జగన్‌ పాలనలో పుడమి తల్లి నుదుటన పచ్చని సంతకమై నిలిచింది. 

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో కరువును పారదోలే లక్ష్యంతో మహానేత వైఎస్సార్‌ చేపట్టిన జలయజ్ఞం నేడు రైతుల పాలిట వరంగా మారింది. మహానేత స్ఫూర్తితో.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం  వైఎస్‌ జగన్‌  జిల్లా లోని ప్రాజెక్టుల పెండింగ్‌ పనులను పూర్తి చేయడంతోపాటు కొత్త సాగునీటి వనరులను నెలకొల్పి కావాల్సినంత నీటిని అందించారు. జిల్లాను సస్యశ్యామలం చేశారు. వైఎస్‌ జగన్‌ పాలన మొదలైన మూడవ ఏడు వరుసగా ప్రాజెక్టులను కృష్ణా జలాలతో నింపడంతో కేసీ కెనాల్, తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలో లక్షలాది ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. భూగర్భ జలాలు పెరిగి ఒట్టిపోయిన బోరు బావులకు నీళ్లు రావడంతో మెట్ట ప్రాంతాల్లో సైతం పసుపు, ఉల్లి, మిరప, పత్తి,  వేరుశనగ, మొక్కజొన్న, శనగ తదితర పంటలు సాగవుతున్నాయి.   

గండికోటలో రికార్డు స్థాయిలో నీరు: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక గండికోట ప్రాజెక్టులో గతేడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 26.85 టీఎంసీల సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టారు. వరుసగా రెండవ ఏడు గండికోటలో ఇంతే స్థాయిలో నీటిని నిల్వ పెడుతున్నారు. అవుకు నుంచి గండికోటకు ఇటీవలే నీటిని విడుదల చేశారు. బుధవారం నాటికి అవుకు నుంచి∙7000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా గురువారం నాటికి దీనిని 9000 క్యూసెక్కులకు పెంచనున్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని ఆరు ప్రాజెక్టుల పరిధిలో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 54.297 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 42.846 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో కొనసాగితే వారం రోజుల్లోపే అన్ని ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది.  ఇదే జరిగితే 2.76 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.  

తెలుగుగంగ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు: తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ ఏడాది సుమారు లక్షా 19 వేల ఎకరాల్లో ఆయకట్టుకు నీళ్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆగస్టు 8న తెలుగుగంగకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఇప్పటికే బ్రహ్మంసాగర్‌ నుంచి బద్వేలు నియోజకవర్గంలోని ఎడమ, కుడికాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గ పరిధిలోని 173 చెరువులను అధికారులు నీటితో నింపారు. దిగువ సగిలేరు ప్రాజెక్టుకు తెలుగుగంగ నీటిని తరలించి బి.కోడూరు, బద్వేలు మండలాల్లో 27 చెరువులను నీటితో నింపారు. తద్వారా 13 వేల ఎకరాల ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. మరోవైపు బద్వేలు, పోరుమామిళ్ల పెద్ద చెరువులతోపాటు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలు చేరడంతో రైతులు వరితోపాటు ఉల్లి, పత్తి, మిరప పంటలను సాగు చేస్తున్నారు.

కేసీ కెనాల్‌ పరిధిలో ఇప్పటికే 30 శాతం వరినాట్లు 
కేసీ కెనాల్‌ పరిధిలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆగస్టు 1న శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ప్రస్తుతం కేసీ ఆయకట్టుకు రాజోలి వద్ద 700 క్యూసెక్కులు, ఆదినిమ్మాయపల్లె వద్ద 150 క్యూసెక్కులు, చాపాడు ఛానల్‌కు 150 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 30 శాతం ఆయకట్టులో వరినాట్లు వేశారు.      

మరిన్ని వార్తలు