వంశధార నడకలా హరుని ఎదుట.. భరణి పాట 

7 Dec, 2021 15:06 IST|Sakshi

సాక్షి, జలుమూరు (శ్రీకాకుళం): నీలోన శివుడు గలడు.. నాలోన శివుడు కలడు.. అంటూ తన్మయత్వంతో ఆయన పాడుతూ ఉంటే మధుకేశ్వరుడు సైతం చెవులొగ్గి విన్నాడు. శబ్బాష్‌రా శంకరా.. అంటూ ఈశుని లీలలు వివరిస్తూ ఉంటే భక్తజనం లిప్తమాత్రం శబ్దం చేయకుండా వింది. ఎంత మోసగాడివి శివా.. అన్న నిందాస్తుతి కూడా శ్రీముఖలింగంలో పంచాక్షరి మంత్రంలా వినిపిస్తూ ఉంటే హరుని ఎదుట భరణి పాట వంశధార నడకలా హాయిగా సాగిపోయింది. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి సోమవారం శ్రీముఖలింగంలో నిర్వహించిన శబ్బాష్‌ రా శంకరా.. కార్యక్రమం హృద్యంగా సాగింది. రాగయుక్తంగా శివస్తుతి చేసిన భరణి.. జిల్లా ప్రాముఖ్యతను కూడా వివరించారు.

శ్రీకాకుళం, శ్రీముఖలింగం, శ్రీకూర్మం వంటి పట్టణాల్లో శ్రీ ఉందని, శ్రీ అంటే సంపద అని వివరించారు. నేటి తరం పిల్లలను మార్కుల కోసం సాధించకుండా.. మానవతా విలువలు కూడా నేర్పాలని సూచించారు. అంతకుముందు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు తనికెళ్లను ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతించి స్వామి వారి శేషవస్త్రాలు అందించి పుణ్యాహవచనాలతో దీవించారు. ఎన్టీఆర్‌ సాఫల్య పురస్కారం జనవరి 18న అందుకోనున్నట్లు తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తమ్మన్నగారి సతీష్, ఐఆర్‌ఎస్‌ అధికారి పూజారి కృష్ణ, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, ఆలయ ఈఓ వీవీఎస్‌ నారాయణ, అర్చకులు పెద్ద లింగన్న, భక్తులు పరిసర గ్రామాలు నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

శ్రీముఖలింగం అంటే నాకెంతో ఇష్టం 
శ్రీముఖలింగం తనకు ప్రీతిపాత్రమైన పుణ్యక్షేత్రమని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నా రు. ముఖలింగేశ్వరుని దర్శించుకోవడం తనకు ఇది నాల్గో సారని తెలిపారు. సినీ ఇండస్ట్రీకి రాక మునుపే స్వామిని దర్శించుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రాచీన శిల్ప కళ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. పురాతన శివలింగాన్ని చూస్తే కలిగే ప్రశాంతత వేరని, ఈ క్షేత్రంపై ప్రచారం కూడా చేశానని తెలిపారు. శివతత్వం సహజంగా రావాలని, అలవాటు చేసుకునేది కాదని తెలిపారు.  

మరిన్ని వార్తలు