సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ?

8 Jun, 2023 03:46 IST|Sakshi

దర్యాప్తునకు సహకరించని శైలజా కిరణ్‌ 

అన్ని ప్రశ్నలకు.. ‘తెలియదు’ అంటూ దాటవేత వైఖరే.. చట్టాలు, నిబంధనలు తమకు వర్తించవనే తీరే 

కానీ సహకరించినట్టుగా సీఐడీ అధికారే చెప్పారంటూ ‘ఈనాడు’ అబద్ధపు రాతలు 

ఇక ఆమెను విచారించాల్సిన అవసరమే లేదని సొంత తీర్పులు

సాక్షి, అమరావతి: తనకు నచ్చినవారిని నెత్తిన పెట్టుకుంటూ.. నచ్చనివారిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల నిధు­లను చట్టానికి విరుద్ధంగా తన సొంత ప్రయోజనాలకు రామోజీరావు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆ కేసుపై ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నించడం విస్మయపరుస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ, రామోజీ కోడలు శైలజా కిరణ్‌ను హైదరా­బాద్‌లో రెండోసారి మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తమకు చట్టాలు, నిబంధనలు వర్తించవనే రీతిలో సీఐడీ అధికారులకు ఏమాత్రం సహకరిం­చలేదు.

అక్రమాలకు సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ అధికారులు ప్రశ్నలు అడిగినా ‘తెలియదు’ అంటూ సమాధానాలు చెప్పకుండా దాటవేత వైఖరిని ప్రదర్శించారు. తాను విదేశాల నుంచి వచ్చానని, తనకు ఆరోగ్యం బాగోలేదని, కళ్లు తిరుగుతున్నాయంటూ సాకులు చెబుతూ విచారణకు ఏమాత్రం సహకరించలేదు.  

విచారణకు అడుగడుగునా అడ్డుపడుతూ.. 
మంగళవారం దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణ ప్రక్రియలో సీఐడీ అధికారులు తాము ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిలో కనీ­సం 25శాతం ప్రశ్నలను కూడా శైలజను అడగలేకపోయారు. దీన్ని బట్టి ఆమె అడుగడుగునా విచారణకు అడ్డుపడుతూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని స్పష్టమవుతోంది.

ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో వైద్యులు పరీక్షించేందుకు సీఐడీ అధికారులు అవకాశం ఇచ్చారు. భోజనానికి, మందులు వేసు­కోవడానికి కూడా విరామం ఇచ్చారు. అయినప్పటికీ శైలజా కిరణ్‌ విచారణకు ఏమాత్రం సహకరించకపోవడం గమనార్హం. అంతే కాకుండా విచారణకు సీఐడీ అధికారులతోపాటు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులైన ఆర్థిక వ్యవహారాల నిపుణులను ఇంటిలోకి రానీయకుండా అడ్డుకునేందుకు యత్నించడం రామోజీ కుటుంబం బరితెగింపునకు నిదర్శనం.

అసలు వాస్తవం ఇది..  
కాగా అసలు వాస్తవం ఏమిటంటే.. తమ విచారణకు శైలజా కిరణ్‌ ఏమాత్రం సహకరించలేదని దర్యాప్తు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారిస్తామని కూడా ఆయన వెల్లడించారు. దర్యాప్తు అధికారి చెప్పిన విషయాలను కాకుండా తమకు అనుకూలంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే తన విష పత్రికలో అబద్ధపు రాతలు రాయించారు.

ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ముసుగులో తమ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ మీడియాపై కూడా రామోజీరావు అక్కసు వెళ్లగక్కారు. శైలజా కిరణ్‌ విచారణ ప్రక్రియకు సబంధించిన వార్తలు సాక్షి మీడియాలో ప్రసారం చేశారని గగ్గోలు పెట్టారు. వాస్తవానికి సాక్షి మీడియానే కాకుండా ఇతర చానళ్లు కూడా శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించడంపై ప్రముఖంగా వార్తలను ప్రసారం చేశాయి.

ఓ సంచలనాత్మకమైన కేసులో.. అందులోనూ ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కేసులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత. కానీ, తాము ఎవరిపైన అయినా విషం చిమ్ముతాం.. ఇంకెవరూ తమపై మాత్రం వాస్తవాలను కూడా రాయకూడదనే తీరులో రామోజీరావు ఉండటం విడ్డూరంగా ఉంది.

దశాబ్దాలుగా చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు నాడు ఎన్టీ రామారావు నుంచి ఇతర ప్రత్యర్థి పార్టీల నేతలపై పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసిన రామోజీ నేడు శ్రీరంగ నీతులు చెబుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తమ ఆర్థిక అక్రమాల సామ్రాజ్యమైన ‘మార్గదర్శి’ కుప్పకూలుతుండటంతో సీఐడీ దర్యాప్తును కూడా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది.

‘ఈనాడు’లో అబద్ధపురాతలు షురూ.. 
విచారణకు ఏమాత్రం సహకరించని రామోజీ కుటుంబం తమ పత్రిక ‘ఈనాడు’లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వార్తలు ప్రచురించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శైలజా కిరణ్‌ విచారణకు పూర్తిగా సహకరించారని సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్‌ తెలిపినట్టుగా ‘ఈనాడు’ తనకలవాటైన రీతిలో అబద్ధపు రాతలు వండి వార్చేసింది. అంతేకాదు.. ఇక శైలజా కిరణ్‌ విచారణ పూర్తయిపోయిందని.. ఇక ఆమెను విచారించాల్సిన అవసరమే లేదని ఆయన వెల్లడించినట్టు కూడా నిర్ధారించేసింది.

మరిన్ని వార్తలు