నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

17 Oct, 2020 04:41 IST|Sakshi

సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఇంద్రకీలాద్రి

సాక్షి అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాన్ని ధరించి దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనానికి రోజుకు పదివేలమందిని అనుమతిస్తారు. శనివారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ అనంతరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆర్జిత సేవలను పరోక్షంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో దుర్గగుడి వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలపై దేవదాయశాఖ ఆంక్షలు విధించింది.   

కోవిడ్‌ నేపథ్యంలో ఇవీ మార్గదర్శకాలు.. 
► మాస్క్‌ ధరించి, ఆన్‌లైన్‌ టికెట్, ఐడీ కార్డు ఉంటేనే క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. 
► దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండే వారిని జర్వంతో బాధపడుతున్నదీ లేనిదీ పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. క్యూలైన్‌లో ఇతరులు తాకిన వస్తువులు తాకవద్దంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.  
► భక్తులు మంచినీటి బాటిల్స్‌ తెచ్చుకోవాలి. అత్యవసరాల కోసం క్యూలైన్‌లో మంచినీటి క్యాన్లు ఉంచారు. దుర్గాఘాట్, ఇతర ఘాట్‌లలో పుణ్యస్నానాలు, తలనీలాల సమర్పణ నిషేధించారు.  
► భక్తులు తమ గ్రామాల్లోనే దీక్షల ఇరుముడులు సమర్పించాలి.  

పెద్ద శేషవాహనంపై మలయప్ప
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలో పెద్ద శేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి అలంకారంలో అనుగ్రహించారు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా, శ్రీమన్నారాయణుడికి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. స్వామి వారికి పానుపుగా, దిండుగా, పాదుకలుగా, ఛత్రంగా, వాహనంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఉదయం బంగారు తిరుచ్చిపై శ్రీ మలయప్పస్వామి వారిని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపట్టారు. 

మరిన్ని వార్తలు