రాజశ్యామల ఉపాసన కేంద్రం విశాఖ శారదాపీఠం 

27 Sep, 2022 05:50 IST|Sakshi
అమ్మవారికి పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి 

శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు  ప్రారంభం 

బాలాత్రిపురసుందరీదేవిగా రాజశ్యామల అమ్మవారు దర్శన

సింహాచలం: తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల అమ్మవారిని ఆరాధించే ఏకైక ఉపాసన కేంద్రంగా విశాఖ శ్రీశారదాపీఠం ఖ్యాతిగాంచిందని, రాజశ్యామల అమ్మవారి ఆరాధనతో ఎంతోమంది ఉన్నతస్థాయికి చేరుకున్నారని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ రాజశ్యామల అమ్మవారిని ఏకాంతంగాను, అంతర్లీనంగాను ఉపాసించాలంటే అది కేవలం విశాఖ శ్రీశారదాపీఠంలోనే సాధ్యమని చెప్పారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనే వారు అదృష్టవంతులవుతారన్నారు.

స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ సాధారణ రోజుల్లోకన్నా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని ఆరాధిస్తే వేయిరెట్లు ఫలితం సిద్ధిస్తుందని చెప్పారు. ఈవేడుకల్లో లోకకల్యాణార్ధం చండీహోమం, చండీ పారాయణం, చతుర్వేద పారాయణం, రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

జగన్మాత రాజశ్యామల అమ్మవారి ప్రీతికోసం శ్రీచక్రానికి నవావరణార్చన చేస్తున్నట్లు చెప్పారు.  శరన్నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత మహాగణపతిపూజ, చండీహోమం, రాజశ్యామల హోమాన్ని నిర్వహించే పండితులు దీక్షాధారణ చేశారు. తొలిరోజు సోమవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  

మరిన్ని వార్తలు