కొండెక్కిన కోడి: కొక్కరొకో.. దిగిరాను పో..!

20 Jul, 2021 18:30 IST|Sakshi

రూ.300 దిశగా కిలో మాంసం ధర

ప్రస్తుతం కేజీ చికెన్‌ రూ.296

నెలన్నర క్రితం పౌల్ట్రీలో క్రాప్‌ హాలిడే ఫలితంగా ధర పెరుగుదల

ఫారాల్లో బ్రాయిలర్‌ కోళ్లకు కొరత

రెండు వారాల్లో రేటు దిగివచ్చే అవకాశం

సాక్షి, అమరావతి బ్యూరో: కోడి మాంసం ధర కొండెక్కింది. కొన్నాళ్ల నుంచి ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.300కు చేరువలో ఉంది. డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కోవిడ్‌ నేపథ్యంలో చికెన్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో మాంసం ధరకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అమరావతి పౌల్రీ ఫార్మర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ విజయవాడ మార్కెట్లో స్కిన్‌లెస్‌ కిలో మాంసం ధరను రూ.296గా నిర్దేశించింది.

అయితే విజయవాడతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది వ్యాపారులు కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. అయినప్పటికీ వినియోగం అంతగా తగ్గలేదని వ్యాపా రులు చెబుతున్నారు. జిల్లాల్లో సాధారణ రోజుల్లో రోజుకు లక్షా 25 వేల బ్రాయిలర్‌ కోళ్లు (దాదాపు 2.50 లక్షల కిలోలు), ఆదివారాల్లో రెట్టింపు.. అంటే రెండున్నర లక్షల కోళ్ల విక్రయాలు జరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలో చికెన్‌ వినియోగం రోజుకు రెండు లక్షల కిలోల వరకు ఉంటోంది.

ఇలా ఎందుకంటే..! 
కోళ్ల ఉత్పత్తి, విక్రయాలను దృష్టిలో ఉంచుకుని హ్యాచరీల నిర్వాహకులు ఏటా మే/జూన్‌ నెలల్లో క్రాప్‌ హాలిడే ప్రకటిస్తారు. ఆ సమయాల్లో వీరు పౌల్ట్రీలకు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెలన్నర రోజుల క్రితం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హ్యాచరీల నిర్వాహకులు క్రాప్‌ హాలిడే అమలు చేశారు. దీంతో ఫారాల్లో కొత్త బ్యాచ్‌లు వేయడం తగ్గిపోయింది. దాదాపు నాలుగు వారాల నుంచి మళ్లీ కొత్త బ్యాచ్‌లు వేయడం మొదలు పెట్టారు. వీటిలో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువు ఎదిగే వరకు ఫారాల్లో పెంచుతారు. ఇందుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత మార్కెట్లో విక్రయిస్తారు. ఇలా కొద్ది రోజుల నుంచి డిమాండ్‌కు సరిపడినంతగా కోళ్ల లభ్యత లేక చికెన్‌ ధర పెరగడానికి కారణమవుతోందని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు (నాని) ‘సాక్షి’కి చెప్పారు.

నెలలో రూ.78 పెరుగుదల.. 
గత నెల 18న కిలో చికెన్‌ ధర రూ.218 ఉంది. అలా జులై ఒకటి నాటికి రూ.230కి పెరిగింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ సోమవారానికి రూ.296కి చేరుకుంది. అంటే గడచిన నెల రోజుల్లో కిలోపై రూ.78లు, 19 రోజుల్లో కిలోకు రూ.66 పెరిగిందన్న మాట. ప్రస్తుత పరిస్థితుల్లో కిలో రూ.300కి పైగా చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మే 15న చికెన్‌ కిలో రూ.312కి చేరుకుని ఆల్‌టైం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే! 

రెండు వారాల్లో తగ్గుముఖం
కోడి మాంసం ధర మరో రెండు వారాల్లో తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వివిధ ఫారాల్లో పెరుగుతున్న బ్రాయిలర్‌ కోళ్లు అప్పటికి రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకోనున్నాయి. దీంతో అవసరమైన మేరకు కోళ్ల లభ్యత పెరిగి చికెన్‌ రేటు తగ్గనుంది. అంటే కిలో రూ.250 లోపు దిగివచ్చి చికెన్‌ ప్రియులకు ఒకింత అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు