శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ మావే..

14 Apr, 2023 05:20 IST|Sakshi

కోటా కంటే 90.36 టీఎంసీలు అధికంగా వాడుకున్న తెలంగాణ

సాగర్‌ కుడి కాలువకు 6, ఎడమ కాలువకు ఒక టీఎంసీ విడుదల చేయండి

కృష్ణా బోర్డుకు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో అంగీకరించిన వాటా కంటే తెలంగాణ సర్కార్‌ అధికంగా 90.36 టీఎంసీలు వాడుకుందని.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తాగునీటి అవసరాలు, ఉద్యాన పంటలు, సాగు చేసిన పంటలను రక్షించుకోవడం కోసం సాగర్‌ కుడి కాలువకు 6, ఎడమ కాలువకు 1 టీఎంసీని విడుదల చేస్తూ తక్షణమే ఉత్తర్వులివ్వాలని కోరింది. ఈ మేరకు గురువారం కృష్ణా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలివీ..

దిగువ కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత నీటి సంవ­త్సరంలో లభ్యతగా ఉన్న జలాలు 961.07 టీ­ఎంసీలు. ఇందులో అంగీకరించిన మేరకు ఏ­పీ వాటా 634.30 టీఎంసీలు(66 శాతం) తె­లంగాణ వాటా 326.77 టీఎంసీలు(34 శాతం).
♦ ఈ నెల 12 వరకూ ఏపీ 470.63 టీఎంసీలు, తెలంగాణ 417.13 టీఎంసీలు వాడుకున్నాయి. వీటిని పరిశీలిస్తే.. ఏపీ కోటా కింద ఇంకా 163.67 టీఎంసీలు మిగిలాయి. తెలంగాణ సర్కార్‌ కోటా కంటే ఎక్కువగా 90.36 టీఎంసీలు అధికంగా వాడుకుంది. 
♦ ఈ నెల 12 నాటికి శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న 126.01 టీఎంసీలన్నీ ఏపీవే. ఆ రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేసి, దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించండి.

మరిన్ని వార్తలు