రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి

18 Mar, 2021 19:47 IST|Sakshi

రాయచోటి: రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఓ కూరగాయల వ్యాపారి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చి మున్సిపల్‌ చైర్మన్‌గా అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రాయచోటికి చెందిన షేక్‌ బాష డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్‌ భాషకు వైఎస్సార్‌ సీ‌పీ మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్‌ టికెట్‌ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ ‌బాషను గెలిపించారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షేక్‌ బాష సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి అధిక శాతం సీట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ మున్సిపాలిటీ, కార్పోరేషన్‌ ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ 86కు గాను, 84స్థానాలలో విజయకేతనం ఎగరవేసిందని అన్నారు. ఈ ఎన్నికలలో మహిళలకు 60.47 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,వెనుకబడిన వర్గాల వారికి 78 శాతం పోస్టులను కేటాయించడం గొప్ప విషయమని కొనియాడారు. 

చదవండి: ఏపీ: కొత్తగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్లు వీరే..


 

మరిన్ని వార్తలు