మామయ్య చెప్పిన ఆ మాట మనసులో నాటుకుపోయింది: వైఎస్‌ భారతి

7 May, 2022 19:33 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పల్లె వాతావరణం ఉట్టిపడేలా వినూత్న ఆకృతిలో ఈ గోశాలను నిర్మించారు. తాజాగా సీఎం జగన్‌ సతీమణి భారతిని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శిల్పారెడ్డి.. గోశాలలో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్మాణం.. అదే విధంగా ఆమె వ్యక్తిగత విషయాల గురించి శిల్ప అడిగి తెలుసుకున్నారు.

గోశాల నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, తన చూపును తిప్పుకోలేకపోతున్నానని శిల్పారెడ్డి అన్నారు. నిర్మాణమంతా చాలా సంప్రదాయబద్దంగా కనిపిస్తోందని, ఇందుకు ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారని అడిగారు. ఇందుకు భారతి స్పందిస్తూ.. ‘గోశాలను ఏ విధంగా నిర్మించాలనే విషయంలో ఎక్కువ వివరాలు ఇవ్వలేదు. అయితే నిర్మాణంలో ఎక్కువగా కృత్రిమ మెటీరియల్‌ను వాడొద్దని, వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండే వస్తువులను ఉపయోగించాలని’ మాత్రమే సూచించినట్లు తెలిపారు.

ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం గురించి మాట్లాడుతూ.. ‘బొప్పాయి మొక్కను మొదట కుండీలో పెంచి ఆ తర్వాత పెరట్లో నాటాము. అలాగే మొక్కజొన్నను కూడా కుండీలలో పెంచాము. ఇంకా ఇంట్లో వండుకునేందుకు వీలుగా పాలకూర, మెంతి కూర కూడా పెంచాము. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా అని పేర్కొన్నారు. ఇంట్లోనే కొన్ని కూరగాయలు, ఆకు కూరలు పెంచుకోవడం, బయట ఫుడ్‌ తగ్గించి స్వయంగా వండుకొని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలమ’ని అన్నారు.

‘నా చిన్నతనంలో మా అమ్మ ఏం చేసేదంటే రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు, పాలు వేసి కలిపి పెట్టేది. పొద్దునకల్లా అది పెరుగన్నంగా మారేది. నాకు తెలిసి అమ్మ ఇప్పటికీ అదే చేస్తుంది. మా మామయ్య (దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి) చెట్లను పెంచేవారు. చాలామంది అది చూసి ఏదైనా పంట వేయకుండా ఇలా ఎందుకు చెట్లను పెంచుతున్నారని అడిగేవారు. ఆయన ఒక్కటే చెప్పేవారు.. ఇది భవిష్యత్తు కోసం నేను పెడుతున్న పెట్టుబడి అనేవాళ్లు. ఆ మాట నా మనసులో నాటుకుపోయింది’ అని వైఎస్‌ భారతి చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాల కోసం కింది ఇంటర్వ్యూని చూడండి.

మరిన్ని వార్తలు