బెజవాడలో శిల్పారామం

3 Jan, 2021 15:38 IST|Sakshi
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన శిల్పారామం  

సాక్షి, విజయవాడ: విజయవాడలో శిల్పారామం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం శిల్పారామం కార్యాలయం మాత్రమే నగరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దీని ఏర్పాటుకు అనువైన స్థలం కోసం అధికారులు వెతుకుతున్నారు. 

విజయవాడకు అవసరం.. 
రాష్ట్రంలో ఇప్పటికే పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరంలలో శిల్పారామాలు ఉన్నాయి. చిత్తూరులో స్థలం ఏర్పాటు చేయడంతో అక్కడ శిల్పారామం నిరిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ శిల్పారామాన్ని ఏర్పాటు చేసి చేతివృత్తుల వారి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు. కృష్ణా జిల్లాలో కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్‌ ఉత్పత్తులు, మంగళగిరి, పెడనలలోని చేనేత వస్త్రాలు మార్కెటింగ్‌ చేసుకోవడానికి శిల్పారామం అవసరం. అలాగే ఇతర ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారి ఉత్పత్తులను ఇక్కడకు తీసుకువచ్చి మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. విజయవాడ ప్రముఖ రైల్వే కూడలి కావడంతో ఇక్కడకు వచ్చి పోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 

స్థలం కోసం వినతి.. 
విజయవాడ వంటి నగరాల్లో శిల్పారామం ఏర్పాటు చేయాలంటే కనీసం 10 నుంచి 15 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. ఈ స్థలాన్ని ఏర్పాటు చేయమని శిల్పారామం అధికారులు కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌కు, సీఆర్‌డీఏ అధికారులకు లేఖ రాశారు. విజయవాడలో అంత స్థలం లేకపోతే విజయవాడ పరిసర ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, కొండపల్లి తదితర ప్రదేశాల్లోనైనా ఇప్పించాలని ఆ లేఖలో కోరారు. గతంలో భవానీ ఐల్యాండ్‌లోనే 20 ఎకరాలు కేటాయించి అక్కడ శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ద్వీపాన్నే పర్యాటకులకు అనుకూలంగా మార్చాలనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. నున్నలో స్థలం చూసినప్పటికీ అది శిల్పారామానికి దక్కలేదు. 

ఎందుకీ శిల్పారామం.. 
శిల్పారామం (ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్‌ విలేజ్‌) ఏర్పడితే.. చేతివృత్తులు, హస్తకళలకు మార్కెటింగ్‌ పెంచవచ్చు. అంతేకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి కూచిపూడి నృత్యం, నాటికలు, పెయిటింగ్స్‌లను ప్రోత్సహించవచ్చు. అంతరించిపోతున్న కళల్ని వెలికి తీసి ఆ కళాకారులకు జీవనోపాధి కల్పించవచ్చు. భావితరాలకు ఆ కళలను గురించి తెలియజేయవచ్చు. ఇతర ప్రాంతాల కళలను ఇక్కడ ప్రదర్శించి ఇతర ప్రాంతాల్లో ఉన్న శిల్పారామాల్లో మన ప్రాంత కళల్ని పరిచయం చేయవచ్చు. శిల్పారామం లోపల బయట చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించవచ్చు. 

ఇక్కడ శిల్పారామం అవసరం..
విజయవాడ ప్రాంతంలో శిల్పారామం చాలా అవసరం. ఇక్కడ చేతి వృత్తుల వారు అనేక మంది ఉన్నారు. వారి ఉత్పత్తులన్నీ ఒక చోటకు చేర్చి మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తే, వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనికి శిల్పారామం ఎంతో ఉపయోగపడుతుంది. రాజధాని ప్రాంతం కావడంతో ఇతర జిల్లాల వారు ఇక్కడకు వస్తారు. వారు శిల్పారామం సందర్శించే అవకాశం ఉంటుంది. 
– జయరాజ్, సీఈవో, శిల్పారామం

మరిన్ని వార్తలు