విశాఖలో షిప్‌ రెస్టారెంట్

24 Mar, 2021 04:20 IST|Sakshi

రుషికొండ రిసార్ట్‌ పునర్నిర్మాణానికి రూ.92 కోట్లు విడుదల 

విజయవాడ, తిరుపతిలో జలవిహార్‌ తరహా ప్రాజెక్టులు 

పద్మావతి యూనివర్సిటీలో రూ.2.25 కోట్లతో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం 

పర్యాటక శాఖ మంత్రి అవంతి వెల్లడి 

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో షిప్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) వెల్లడించారు. విశాఖలోని రుషికొండ రిసార్ట్‌ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.92 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. విజయవాడ, తిరుపతిలో జలవిహార్‌ తరహాలో ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో పర్యాటక, క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాల అమలు తీరు తెన్నులపై మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియాలో భాగంగా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ కింద కడప జిల్లా పుట్లంపల్లిలోని వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. క్రీడల్లో శిక్షణ, క్రీడా పరికరాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.3.18 కోట్లను ఇటీవల మంజూరు చేసిందన్నారు.  

పర్యాటక రంగానికి పెద్దపీట 
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఇందుకోసం పీపీపీ పద్ధతిలో రిసార్టులు, త్రీ స్టార్, ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి పెట్టుబడులు ఆహ్వానిస్తోందని తెలిపారు. ఇందుకోసం బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో రోడ్‌ షోల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వారానికోసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పాపికొండల్లో బోటు పర్యాటకాన్ని మరో వారం రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌తో పాటు భీమిలి, రుషికొండ, మంగమారిపేట బీచ్‌లను గోవా, మెరీనా బీచ్‌ల తరహాలో అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. శ్రీశైలం ఆలయంలో ప్రసాదమ్‌ పథకం కింద చేపట్టిన పనులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించామని, త్వరగా తేదీపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సింహాచలంలోనూ ఇదే పథకం కింద చేపట్టే పనులకు శంకుస్థాపన తేదీపై కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు