మత ఘర్షణల సృష్టికే..

6 Jan, 2021 03:25 IST|Sakshi

పక్కా ప్రణాళిక ప్రకారమే ఆలయాల్లో ఘటనలు

పోలీస్‌ దర్యాప్తులో నిగ్గుతేలుతున్న విషయాలు

రెండ్రోజులుగా తిరుపతి నుంచి డీజీపీ సవాంగ్‌ ఆరా

రామతీర్థం నిందితులను గుర్తించేందుకు టెక్నాలజీ..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలు పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఇవి ఆకతాయిలు చేస్తున్న పనులు కావని.. రాష్ట్రంలో మతపరమైన అలజడులు రేపేందుకే చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్, శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ వేర్వేరుగా నిర్వహించిన కీలక సమావేశాల్లో వీటిపై ఒక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిరువురూ సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఏకబిగిన నాలుగు గంటలపాటు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ యూనిట్ల బాధ్యులు, దేవాలయ ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న బృందాలతో మాట్లాడారు. అలాగే, మంగళవారం మధ్యాహ్నం గంటన్నరపాటు డీజీపీ తిరుపతి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ రెండు సమావేశాలతో పోలీస్‌ ఉన్నతాధికారులు ఆలయ ఘటనలకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

ఈ ఘటనలను నిశితంగా గమనిస్తే ఇవి ఏదో ఆకతాయితనంగా చేసినట్లులేదని, ఒక లక్ష్యంతో చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం డబ్బుల కోసం బందోబస్తు లేని దేవాలయాల్లో హుండీ చోరీలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఈ దుండగులు ఆధారాలు వదిలిపోవడంతో పట్టుబడేవారని.. కానీ, గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి జరుగుతున్న ఘటనలు మాత్రం ఆ కోవకు చెందినవి కావనే విషయం స్పష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు. మతపరమైన గొడవలు రేపి ప్రభుత్వాన్ని, పోలీసులను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో చేస్తున్నట్లు ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో జనసంచారం తక్కువగా ఉండే ఆలయాలు, ప్రైవేటు, ప్రతిపక్ష పార్టీ అజమాయిషీలో ఉన్న ఆలయాలనే టార్గెట్‌గా చేసుకోవడం వెనుక పెద్దకుట్రే ఉందంటున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటివరకు 17 ఘటనల్లో నిందితులను పట్టుకున్నామని, వారిలో అన్యమతస్తులు లేరని ఒక పోలీస్‌ అధికారి చెప్పారు. దీనిబట్టి రాజకీయ కోణంలోనే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నట్లు ఆ అధికారి వ్యాఖ్యానించారు.
 
సాంకేతిక పరిజ్ఞానంతో వేట

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో డీఐజీ కేఎల్‌ కాంతారావు పర్యవేక్షణలో పనిచేస్తున్న ఐదు ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఆ దిశగా దృష్టిసారించాయి. మరోవైపు ఏపీ సీఐడీకి ఈ కేసు అప్పగించడంతో వారు కూడా రంగంలోకి దిగితే కొద్దిరోజుల్లోనే రామతీర్థం దుండగులను పట్టుకుంటామని పోలీసు అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రామతీర్థం ప్రాంతంలో ఎవరెవరు వచ్చి వెళ్లారు.. అక్కడ సెల్‌ఫోన్‌ టవర్ల పరిధిలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారు తదితర కోణాల్లో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే ఆలయం వద్ద వేలిముద్రలు సేకరించిన క్లూస్‌ టీమ్‌ మరిన్ని ఆధారాల కోసం జల్లెడపడుతోంది. వీటిని అనుమానితులతో సరిపోల్చనున్నారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.  

మరిన్ని వార్తలు