డిమాండ్‌ కొండంత.. ఉత్పత్తి గోరంత..

27 May, 2021 03:34 IST|Sakshi

దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు యాంఫోటెరిసిన్‌–బి ఇంజక్షన్ల కొరత

దేశవ్యాప్తంగా ఇప్పటికే 11,717 మందికి బ్లాక్‌ ఫంగస్‌

ఒకొక్కరికి సగటున 100 వంతున 11,71,700 వయల్స్‌ అవసరం 

ప్రస్తుతం దేశంలో 5 సంస్థల నెల ఉత్పత్తి 1,63,747 వయల్స్‌

మరో 5 సంస్థలకు ఈ ఇంజక్షన్ల ఉత్పత్తికి అనుమతి

10 సంస్థలు జూన్‌ నాటికి ఉత్పత్తి చేసేది నెలకు 2,55,114

9 లక్షల వయల్స్‌ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

ఇప్పటికి వచ్చింది కేవలం 50 వేలే

జూన్‌ నాటికి మరో 3.15 లక్షల వయల్స్‌ వచ్చే అవకాశం

అన్నీ కలిపి జూన్‌ నాటికి 5.70 లక్షల ఇంజక్షన్లే అందుబాటులోకి

సాక్షి, అమరావతి: కరోనాను జయించి బయటపడిన వారిలో కొందరిపై బ్లాక్‌ ఫంగస్‌ పంజా విసురుతోంది. మధుమేహవ్యాధి నియంత్రణ లేని, అతిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారిలో విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో 11,717 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. చికిత్సలో ఒక్కొక్కరికి 100 చొప్పున యాంఫోటెరిసిన్‌–బి ఇంజక్షన్లు అవసరం. అంటే.. ఇప్పుడు వ్యాధిబారిన పడినవారికే 11.71 లక్షల ఇంజక్షన్లు కావాలి. ప్రస్తుతం దేశంలో 5 సంస్థలు నెలకు 1,63,747 ఇంజక్షన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. మరో 5 సంస్థలకు వాటిని ఉత్పత్తి చేసేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది.

ఈ 10 సంస్థలు జూన్‌ నాటికి నెలకు 2,55,114 వయల్స్‌ మాత్రమే ఉత్పత్తి చేయగలవు. విదేశాల నుంచి తొమ్మిది లక్షల ఇంజక్షన్లను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో జూన్‌కు 3.15 లక్షల వయల్స్‌ వస్తాయని చెబుతోంది. ఈ లెక్కన జూన్‌ నాటికి నెలకు 5.70 లక్షల వయల్స్‌ మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారినపడిన వారి చికిత్సకే ఇవి చాలవని స్పష్టమవుతోంది. నానాటికీ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతుండటంతో.. ఆ వ్యాధి చికిత్సలో వాడే కీలకమైన యాంఫోటెరిసిన్‌–బి ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా మారుతుందని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా దోపిడీదారులు.. ఈ ఇంజెక్షన్లను దారిమళ్లించి బ్లాక్‌ మార్కెట్లో 6 నుంచి 10 రెట్లు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

18 రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 18 రాష్ట్రాల్లో 11,717 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో గుజరాత్‌లో అత్యధికంగా 2,859 కేసులు నమోదవగా.. కర్ణాటకలో 2,770 కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి చికిత్సలో ప్రధానంగా యాంపోటెరిసిన్‌–బి ఇంజక్షన్లు ఇస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగికి రోజుకు 3, 4 డోసుల చొప్పున కొన్ని వారాలపాటు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ ఫంగస్‌ వ్యాధుల చికిత్సలోను రెండు దశాబ్దాలుగా ఈ ఇంజక్షన్‌ను ఉపయోగిస్తున్నారు.

దేశంలో భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్, బీడీఆర్‌ ఫార్మాస్యూటికల్స్, సన్‌ ఫార్మా, సిప్లా, లైఫ్‌ కేర్‌ ఇన్నొవేషన్స్‌ సంస్థలు మాత్రమే ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో వీటి తయారీలో ఏడాదికి 100 నుంచి 150 కిలోల లిపిడ్లు (ముడిపదార్థం) వరకు అవసరమయ్యేవి. ఈ ఫంగస్‌ కేసులు కనిష్ఠస్థాయిలో నమోదవడం వల్ల ఆ ఇంజెక్షన్లకు కొరత ఉండేది కాదు. కానీ.. 2 నెలలుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ ఇంజక్షన్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఉత్పత్తి పెంచారు. ప్రస్తుత డిమాండ్‌ మేరకు ఇంజక్షన్ల ఉత్పత్తికి ఏడాదికి 1,000 కిలోల లిపిడ్లు అవసరం. కానీ.. ప్రపంచంలో లిపిడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వాటిని దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది.

వైద్యనిపుణుల్లోను ఆందోళన
బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం కేంద్రం 9 లక్షల యాంపోటెరిసిన్‌–బి ఇంజక్షన్లను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 వేల వయల్స్‌ను దిగుమతి చేసుకుని.. మే 21 నుంచి 24 మధ్యన 43 వేల వయల్స్‌ను రాష్ట్రాలకు అందజేసింది. ఓ వైపు దిగుమతి చేసుకుంటూనే ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ద్వారా డిమాండ్‌ మేరకు ఇంజక్షన్లను అందుబాటులోకి ఉంచడానికి చర్యలు చేపట్టామని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో నాట్కో ఫార్మాస్యూటికల్స్, ఆలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్, గుపిక్‌ బయోసైన్సెస్, ఎమెక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్, లిక్య సంస్థలకు ఆ ఇంజక్షన్ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది.

ఈ 10 సంస్థల ద్వారా దేశీయంగా జూన్‌ నాటికి 2,55,114 వయల్స్‌ అందుబాటులోకి వస్తాయి. జూన్‌లో మిలాన్‌ ల్యాబ్స్‌ ద్వారా 3.15 లక్షల వయల్స్‌ దిగుమతి చేసుకుంటామని కేంద్రం చెబుతోంది. వీటితో కలిపి జూన్‌ నాటికి 5,70,114 ఇంజక్షన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఈ ఇంజక్షన్లు ఇప్పటికే బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినవారికే సరిపోవని.. ఇకపై నమోదయ్యే కేసుల మాటేమిటని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిని గుర్తించి.. యాంపోటెరిసిన్‌–బి ఇంజక్షన్లను వేయకపోతే మరణాల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు