జేసీ అయితే ఏంటి?

9 Oct, 2021 08:24 IST|Sakshi
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌ 

దుర్గగుడి టోల్‌గేట్‌ వద్ద జేసీ కారును అడ్డగించిన ఎస్‌ఐ 

పాస్‌ చూపిస్తేనే అనుమతిస్తామన్న సీఐ 

పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన జాయింట్‌కలెక్టర్‌ శివశంకర్‌

సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ‘మీరు ఎవరో నాకు తెలియదు. పాస్‌ ఉంటే చూపించండి. కొండపైకి పంపుతా’ అంటూ జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ కారును ఎస్‌ఐ, సీఐ అడ్డగించిన ఘటన శుక్రవారం ఇంద్రకీలాద్రి టోల్‌గేట్‌ వద్ద చోటు చేసుకుంది. దసరా పనుల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ శుక్రవారం మధ్యాహ్నం తన కారులో కొండపైకి బయలుదేరారు. టోల్‌గేట్‌ వద్ద జేసీ కారును అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ బి.శంకర్రావు అడ్డుకుని పాస్‌ చూపించాలని కోరారు. తాను జేసీనని చెప్పినా వినకపోవడంతో అక్కడే ఉన్న సీఐ ఎస్‌.ఎస్‌.వి.నాగరాజు వద్దకు వెళ్లి తన కారునే ఆపుతారా అని ప్రశ్నించారు. పాస్‌ ఉంటేనే కారును కొండపైకి పంపుతానని సీఐ చెప్పడంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీంతో జేసీ శివశంకర్‌ వెంటనే నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని సీపీ శ్రీనివాసులు మీడియా ముఖంగా వెల్లడించారు.  

చదవండి: (డ్రగ్స్‌ డాన్‌.. కుల్దీప్‌ సింగ్‌)

పోలీసుల తీరుపై సీరియస్‌ 
సీఐ, ఎస్‌ఐ తీరుపై జేసీ శివశంకర్‌ సీరియస్‌ అయ్యారు. పోలీసుల తీరుకు నిరసనగా ఘాట్‌రోడ్డు నుంచి కొండపైకి నడిచి వెళ్లారు. మార్గమ ధ్యలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రొటోకాల్‌పై కలెక్టర్‌ సీరియస్‌ 
వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో అధికారుల ప్రొటోకాల్‌ వ్యవహరంపై కలెక్టర్‌ జె.నివాస్‌ సీరియస్‌ అయ్యారు. కలెక్టర్‌ దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం రాత్రి ఇంద్రకీలాద్రిపైకి చేరుకొని ఆయా పరిసరాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఘాట్‌రోడ్డులో జాయింట్‌ కలెక్టర్‌ను పోలీసులు అడ్డుకోవడంపై అధికారులను కలెక్టర్‌ మందలించారు. ఉత్సవాలు సవ్యంగా, విజయవంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు