అర్ధరాత్రి ఎస్‌ఐ హల్‌చల్‌.. లాఠీలు తీసుకుని..

24 May, 2022 13:19 IST|Sakshi
ఎస్‌ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌ గోపాలకృష్ణ, గ్రామస్తులు

కుర్నూతల సర్పంచ్, రైతులపై లాఠీలతో వీరంగం   

ఆగ్రహించి గ్రామస్తుల ఆందోళన  

సీఐ హామీతో శాంతించిన వైనం   

ఎస్‌ఐను వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు

సాక్షి,వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): మండలంలోని కుర్నూతల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఎస్‌ఐ హల్‌చల్‌ చేశారు. అధికారుల అనుమతితో మట్టి తోలుకుంటున్న రైతులపై లాఠీలు ఝుళిపించారు. అదేమని అడిగిన సర్పంచ్‌నూ దుర్భాషలాడారు. లాఠీతో కొట్టారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. కుర్నూతలలోని మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులో పూడిక తొలగించి ఆ మట్టితో తమ పొలాల్లో భూమిని చదును చేసుకుంటామంటూ చింతపల్లిపాడుకు చెందిన కొందరు రైతులు కొద్దిరోజుల కిందట ఇరిగేషన్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి చెరువులో మట్టిని పొక్లెయినర్‌తో ట్రాక్టర్లకు లోడింగ్‌ చేస్తున్న సమయంలో వట్టిచెరుకూరు ఎస్‌ఐ కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. వస్తూవస్తూనే రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు.  ఈ విషయం తెలుసుకుని  వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ గోపాలకృష్ణ ఘటనా స్థలానికి వెళ్లారు. రైతులను అన్యాయంగా ఎందుకు కొడుతున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఎస్‌ఐ సర్పంచ్‌ గోపాలకృష్ణపైనా దుర్భాషలాడారు. ఆయననూ లాఠీతో కొట్టారు. ఎస్‌ఐ తీరుతో కంగుతిన్న పక్కనే ఉన్న కానిస్టేబుళ్లు సర్పంచ్‌ను కొట్టవద్దంటూ నిలురించేందుకు యత్నించినా ఎస్‌ఐ ఆవేశంతో ఊగిపోయారు.

విషయం బయటకు రావడంతో కుర్నూతలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. ఇదేం పద్ధతంటూ ఎస్‌ఐను నిలదీశారు. ఇరిగేషన్‌ అధికారులు అనుమతిచ్చిన తరువాతే చెరువులో మట్టి తవ్వుకుంటున్న తమను కొట్టడం ఏంటని ప్రశ్నించారు. చేబ్రోలు సీఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు గ్రామస్తులతో చర్చించారు. సీఐ హామీతో గ్రామస్తులు శాంతించారు. ఎస్‌ఐ అడిగినట్లుగా రూ.ఐదు లక్షలు ఇవ్వనందువల్లే ఇలా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్‌ఐ కేవీ కోటేశ్వరరావును ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపినట్లు చేబ్రోలు సీఐ తెలిపారు.


  

మరిన్ని వార్తలు