వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు అత్యంత స్వల్పం..

19 Aug, 2021 03:28 IST|Sakshi

 వ్యాక్సిన్‌ వేయించుకున్నాక ఆస్పత్రిలో చేరింది కేవలం 13 మందే..  

సాక్షి, అమరావతి:  కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి అత్యంత స్వలంగానే దుష్ప్రభావాలు కలిగినట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 53 కోట్ల డోసులకు పైగా వేయగా.. కేవలం 2.50 లక్షల మందికే స్వల్పంగా దుష్ప్రభావాలు కలిగాయి. ఇక మన రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.52 కోట్ల డోసులు వేయగా.. కేవలం 873 మందికి మాత్రమే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

రాష్ట్రంలో ఇలా స్వల్ప ప్రభావం చూపించింది కేవలం 0.003 శాతం మందికి మాత్రమేనని తేలింది. తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందిన వారు కేవలం 13 మంది మాత్రమే ఉన్నట్టు ఆరోగ్యశాఖ పరిశీలనలో వెల్లడైంది. ఐదేళ్ల లోపు చిన్నారులున్న తల్లులకు, గర్భిణులకు వ్యాక్సిన్‌ వేసినప్పుడు కూడా దుష్ప్రభావాలు కనిపించలేదని, వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ఆరోగ్యశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. అందుబాటులో ఉన్న పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని వారు సూచించారు.   

మరిన్ని వార్తలు