‘కొద్ది రోజుల్లో విశాఖ నుంచి పాలన ప్రారంభం’

1 Aug, 2020 14:33 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : విశాఖపట్నం ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటిదని మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాన్ని రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా ప్రకటించడం హర్షనీయమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం ఈ బిల్లు పట్ల సంతోషంగా ఉన్నారని, ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన చంద్రబాబు అభివృద్ది వికేంద్రీకరణ అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చారని మంత్రి గుర్తు చేశారు. సీఎం జగన్..‌ రాజధాని అభివృద్ధి కోసం జీఎన్‌ రావు కమిటీ వేశారని, ఆర్ధిక అసమానతలు తలెత్తి భవిష్యత్తులో ఉద్యమాలు రాకుండా వికేంద్రీకరణ బిల్లు తీసుకురావడం జరిగిందన్నారు. (విశాఖపై పోలీసు శాఖ ఫోకస్‌ )

ఉత్తరాంధ్రలో తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం గణాంకాలు ఇక్కడి ఆర్ధిక వెనుకబాటుతనానికి సూచిక అని తెలిపారు. అమరావతి రాజధానికి రూపకల్పన చేయడానికి ముందే చంద్రబాబు తన బంధుగణానికి ఆస్తులు సమకూర్చారని విమర్శించారు. సీఆర్‌డీఏ బిల్లు తీసుకువచ్చిన తన వాళ్లకు చంద్రబాబు మేలు చేశారని దుయ్యబట్టారు. ప్రజలంతా అమరావతి కోరుకుంటున్నారని చంద్రబాబు నమ్మితే.. టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు.(మంత్రి హోదాలో విచ్చేసిన సీదిరి)

అమరావతి కోసం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో చెప్పగలరా అని చంద్రబాబును మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ప్రజలను వంచించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటామంటే ప్రజలు ఆమోదించరని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశ సుజల స్రవంతికి ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని బాబును నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్దిపై ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉందని అందుకే అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కాలనిర్దేశం పెట్టి పనులు చేపట్టారని తెలిపారు. అమరావతి భూముల ధరలు తగ్గుతాయని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రపంచ ఉద్యమంగా చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. కొద్ది రోజుల్లోనే విశాఖపట్నం నుంచి పాలన ప్రారంభం అవుతుందని హర్షం వ్యక్తం చేశారు. (హిందుస్తాన్‌ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం)

>
మరిన్ని వార్తలు