పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తాం 

7 Aug, 2020 08:34 IST|Sakshi

రాష్ట్ర మత్స్యశాఖ, పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు  

సాక్షి, కాశీబుగ్గ : దీర్ఘకాలంగా జిల్లాలో పెండింగ్‌లో ఉండిపోయిన పనులపై రానున్న రోజుల్లో దృష్టి సారిస్తామని రాష్ట్ర మత్స్యశాఖ, పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో ముఖా–ముఖి మాట్లాడారు.
  
సాక్షి : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు జిల్లా విషయానికి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు..? 
మంత్రి : నేను రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ ముందుగా పలాసకు ఎమ్మెల్యేను, శ్రీకాకుళం జిల్లా వాసిని. అందు చేత అనేక ప్రభుత్వాలు దాట వేస్తూ చేతులెత్తేసిన దీర్ఘకాల సమస్యలపై దృష్టి సారిస్తాను. జిల్లాలో ఉన్న మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు వంటి వాటిపై దృష్టి పెడతాను. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ ప్రాజెక్టును ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. నాన్నగారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పూర్తి చేద్దామని అంటుంటారు. ఇప్పటికే పాత టెండర్‌ను రద్దు చేశారు. నెల రోజుల వ్యవధిలో కొత్త టెండర్లకు పిలుపునిచ్చి నిర్మాణ పనులు చేపడతారు. ఇలా జిల్లా విషయానికి వస్తే దీర్ఘకాలంగా సమస్యలుగా ఉన్న వాటిని గుర్తించి మన జిల్లా సీనియర్‌ నేతల ఆలోచనలు, సలహాలతో పూర్తి చేస్తాం. 

సాక్షి : తిత్లీ తుఫాన్‌తో నష్టపోయిన ఉద్దాన జీడి, కొబ్బరి రైతులను ఏవిధంగా ఆదుకోవాలనుకుంటున్నారు? 
మంత్రి : తిత్లీ సమయంలో టీడీపీ నాయకులే పరిహారాన్ని చాలావరకు మింగేశారు. దీనిపై పాదయాత్ర సమయంలోనే వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లాం. అందుకే ఆయన అర్హుల ఎంపికతో పాటు పరిహారం రెట్టింపు చేశారు. టెక్నికల్‌ సమస్యలు పరిష్కరించి మూడు వారాల్లో పరిహారం అందజేస్తాం. జీడి విషయంలో కూడా సీఎం వద్ద ప్రస్తావిస్తే రూ.10వేల మద్దతు ధర ప్రకటించారు. పలా స పరిసర ప్రాంతాలలో హారీ్టకల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ని ర్మించడానికి మంజూరు చేశారు. రానున్న రోజుల్లో ఉద్దానం రైతన్నలకు మేలు జరుగుతుంది.   (రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే)

సాక్షి : రాజకీయాల్లో మీకు అనుభవం తక్కువ. మంత్రిగా రాణించడానికి ఏం చేస్తారు?
మంత్రి :మన జిల్లా అదృష్టమో, నా అదృష్టమో గానీ నేను ఏ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినా వారు కాదనడం లేదు. అందుకే మరింత ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సుభిక్షంగా జీవిస్తున్నప్పుడు అందకంటే కావాల్సింది ఏముంటుంది.   

సాక్షి : కిడ్నీ వ్యాధి బాధితుల కోసం చేస్తున్న పనులు? 
మంత్రి :గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డయాలసిస్‌కు ముందుకు వచ్చే వారు కాదు. అలా ఇంట్లోనే ఉండిపోయి చనిపోయేవారు. ఆ బాధలను జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో నూతనంగా డయాలసిస్‌ కేంద్రాలతో పాటు, డయాలసిస్‌ చేసుకుంటున్న వ్యక్తి ఇంటికి రూ.10వేలు వలంటీర్‌ ద్వారా అందిస్తున్నారు. క్రియాటిన్‌ తక్కువగా ఉన్నవారికి రూ.5వేలు పింఛన్‌ సైతం అందిస్తున్నారు. శుక్రవారం నాడు మందసలో పది బెడ్‌లతో నూతన డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నాం. కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు వాటర్‌ గ్రిడ్‌ను నిర్మించనున్నాం. ఒక్క పలాస నియోజకవర్గంలో నాలుగు ప్రాంతాల్లో లక్షా యాభైవేల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకర్ల నిర్మాణం జరగనుంది. వంశధార రిజర్వాయర్‌ నుంచి సుమారు 50 కిలోమీటర్లు పైపులైన్‌ పలాసకు రానుంది. ఇది పూర్తయితే ప్రజల గుండెల్లో నాయకులు నిలిచిపోవడం ఖాయం. 

సాక్షి : కరోనాపై ఓ డాక్టర్‌గా మీ సలహా?  
మంత్రి : కరోనాకు ఏ ఒక్కరూ అతీతం కాదు. అందరం కరోనాను చూడాల్సిందే. మన వద్ద కేసులతో పాటు రికవరీ కూడా పెరుగుతోంది. అందులోనూ ప్లాస్మా థెరపీ కూడా పనిచేస్తోంది. అందుకే ప్లాస్మా దానానికి ముందుకు రావాలి. దీనిపై అపోహలు అక్కర్లేదు.  

సాక్షి : పలాస ప్రాంతంలో వరుసగా అధికారుల సస్పెన్షన్‌పై మీ అభిప్రాయం? 
మంత్రి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ప్రజలకు సేవ చేయడానికి ఉన్న వారు తప్పుగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే మూల్యం చెల్లించక తప్పదు.  

సాక్షి : మూడు రాజధానులపై మీ వాదన? 
మంత్రి : అమరావతి కోసం రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టేయాలని గత ప్రభుత్వం చూసింది. అది సరికాదు. అలా గే అక్కడ చంద్రబాబు తన వర్గం వారిని మాత్రమే ఆలోచనలో పెట్టుకున్నారు. మూడు రాజధానుల వల్ల మూ డు ప్రాంతాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని రావడంతో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాల్లో సైతం వలసలు తగ్గుముఖం పడతాయి.  

మరిన్ని వార్తలు