గణనీయంగా పెరిగిన గుడ్లు, మాంసం ఉత్పత్తి

24 Apr, 2021 04:56 IST|Sakshi

2020–21లో మాంసం 11.76 శాతం, గుడ్లు 15 శాతం పెరుగుదల

రాష్ట్రంలో మొత్తం పశుసంపద 3,40,68,177

అత్యధికంగా అనంతపురం జిల్లాలో 66.06 లక్షలు

అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 14.44 లక్షలు

గతంతో పోల్చితే మేకలు, గొర్రెల సంపద పెరిగింది

పాల ఉత్పత్తి పెంచేందుకు ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన దాణా సరఫరా   

సాక్షి, అమరావతి: రాష్రంలో గుడ్లు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి 15 శాతం, మాంసం ఉత్పత్తి 11.76 శాతం పెరిగాయి. 2019–20లో 8.50 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి కాగా 2020–21లో 9.54 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయిందని పశుసంవర్ధకశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2019–20లో 2,170.77 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా 2020–21లో 2,496.39 కోట్లు ఉత్పత్తి అయినట్లు అంచనా వేశారు. 2020–21లో 147.13 లక్షల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ అంచనాలను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్రానికి పంపించింది. కేంద్రం ఆమోదిస్తే వాటి విలువ ఎంత అనేది కూడా తేలనుందని అధికారులు తెలిపారు.

మరోపక్క తాజా గణాంకాల మేరకు రాష్ట్రంలో మొత్తం 3,40,68,177 పశుసంపద ఉంది. ఇందులో అత్యధిక పశుసంపద అనంతపురం జిల్లాలో 66.06 లక్షలుండగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14.44 లక్షలు ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరగతి రైతుల వద్ద ఎక్కువగా పశుసంపద ఉంది. కరువు పరిస్థితుల్లో ఆ రైతులకు ప్రధాన ఆదాయవనరు పశుసంపదే. రాష్ట్రంలో మొత్తం 46,00,087 ఆవులు ఉండగా 62,19,499 గేదెలున్నాయి. 1,76,26,971 గొర్రెలుండగా 55,22,133 మేకలు ఉన్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో మేకలు, గొర్రెల సంపద గణనీయంగా పెరిగింది. గతంలో గొర్రెలు 135.60 లక్షలుంటే తాజా గణాంకాల ప్రకారం 176.26 లక్షలకు, మేకలు 44.96 లక్షల నుంచి 55.22 లక్షలకు పెరిగాయి.

వైఎస్సార్‌ చేయూత ద్వారా మహిళలకు పాడిపశువులు
రాష్ట్రంలో మరింత పాలు, మాంసం ఉత్పత్తి పెంచడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు జీవనోపాధి మెరుగుపరచడం ద్వారా ఆర్థికంగా వారి కాళ్లమీద వారే నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత ద్వారా ఆర్థికసాయం అందించింది. వారు కోరుకున్న మేరకు పాడి పశువులు, మేకలు, గొర్రెలు కూడా సమకూర్చేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు జగనన్న పాలవెల్లువ కింద 1,12,008 యూనిట్లను అందజేయాలని, అలాగే జగనన్న జీవక్రాంతి ద్వారా 72,179 యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 70 శాతం మేర యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. 

పాల ఉత్పత్తి పెంచేందుకు నాణ్యమైన దాణా
రైతుభరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను సబ్సిడీపై సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మినరల్, మిశ్రమ లవణాలు ఉన్న దాణాను సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద 20 వేల ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో పశుగ్రాసం పెంచేందుకు చర్యలను చేపట్టాం. ఈ చర్యలతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. చేయూత మహిళలకు జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నాం. 
– అమరేంద్రకుమార్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌  

మరిన్ని వార్తలు