సీలేరు.. లక్ష్యంలో సరిలేరు!

12 Apr, 2021 04:54 IST|Sakshi
పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం

లక్ష్యాలను అధిగమించిన సీలేరు జలవిద్యుత్‌ కేంద్రాలు

2,705.36 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి

రంపచోడవరం/మోతుగూడెం: సీలేరు జలవిద్యుత్‌ కేంద్రాలు విద్యుత్‌ ఉత్పత్తిలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాయి. ఐదేళ్లుగా లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రాలున్నాయి. వీటి ఉత్పత్తి లక్ష్యాలను ఏటా కేంద్ర విద్యుత్‌ అథారిటీ (సీఈఏ) నిర్దేశిస్తుంది. సీలేరు కాంప్లెక్స్‌లోని నాలుగు జలవిద్యుత్‌ కేంద్రాలకు 2020–21లో 2,074.98 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం కాగా, మార్చి నెలాఖరుకు 2,705.36 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. మొత్తం నాలుగు విద్యుత్‌ కేంద్రాలు పరస్పరం పోటీ పడినట్టుగా అధిక ఉత్పత్తి సాధించాయి. అంతేకాదు.. ఈ కేంద్రాల ద్వారా ఈ ఏడాది గోదావరి డెల్టాకు 45 టీఎంసీల నీటిని కూడా అందించారు. గత ఏడాది నీటి సమస్యతో పాటు యూనిట్లు తరచూ మొరాయించిప్పటికీ విద్యుత్‌ ఉత్పత్తిలో లక్ష్యాన్ని సాధించడం విశేషం.

ఈ ఏడాది పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంతో పాటు డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రంలోని యూనిట్లు మొరాయించాయి. స్థానిక ఇంజనీర్ల కృషితో పాటు కార్మికులు యూనిట్ల మరమ్మతులో జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ ఈ లక్ష్యాలను సాధించారు. రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా రోజుకు 9.18 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండగా ఒక్క సీలేరు కాంప్లెక్స్‌లోనే డిమాండ్‌కు అనుగుణంగా రోజుకు 7 నుంచి 8 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. నాగార్జున సాగర్, టెయిల్‌ పాండ్, పెన్నా అహోబిలం, చెట్టుపేట మినీ జలవిద్యుత్‌ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి జరగడం లేదు.

సమష్టి కృషితోనే సాధ్యం
డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. నీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ గోదావరి డెల్టాకు అవసరమైన నీటిని విడుదల చేస్తూ, లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. స్థానిక ఇంజనీర్లు, సిబ్బంది కృషితో లక్ష్యాన్ని సాధించాం.
– ఎం.గౌరీపతి,చీఫ్‌ ఇంజనీర్, సీలేరు కాంప్లెక్స్, మోతుగూడెం, తూర్పు గోదావరి జిల్లా

సాంకేతిక సమస్యలు అధిగమించాం..
ఈ నాలుగు జలవిద్యుత్‌ కేంద్రాల్లోని యూనిట్లు ఏటా మొరాయిస్తున్నా.. ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోగలిగాం. నాలుగు జలవిద్యుత్‌ కేంద్రాల యూనిట్ల ఆధునికీకరణకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం. త్వరలోనే అనుమతులు లభిస్తే యూనిట్ల ఆధునికీకరణకు చర్యలు చేపడతాం.
– కె.బాలకృష్ణ, డీఈ (ఎలక్ట్రికల్‌), ఆపరేషన్, మెయింటెనెన్స్‌ 

మరిన్ని వార్తలు