అప్పన్న భూముల బాగోతంపై విచారణ షురూ

14 Jul, 2021 03:57 IST|Sakshi
సింహాచలం దేవస్థానం కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న భ్రమరాంబ, పుష్పవర్థన్, అసిస్టెంట్‌ కమిషనర్లు

దేవస్థానం రికార్డుల నుంచి 748.07 ఎకరాలు తప్పించడంపై దర్యాప్తు

కార్యాలయంలో పలు రికార్డుల పరిశీలన

సింహాచలం (పెందుర్తి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సింహాద్రి అప్పన్నస్వామి భూముల గోల్‌మాల్‌పై విశాఖలో విచారణ ప్రారంభమైంది. ఈ భూబాగోతంపై రాష్ట్ర దేవదాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అర్జునరావు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆ శాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్, విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓ డి. భ్రమరాంబ, విశాఖ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్థన్‌ మంగళవారం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టి రికార్డులను పరిశీలించారు. 

నగరంలోని అడవివరం, చీమలాపల్లి, వేపగుంట ప్రాంతాల్లో దేవస్థానానికి చెందిన రూ.10వేల కోట్లకు పైగా విలువచేసే 748.07 ఎకరాలను 2016లో  నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానం ఆస్తుల రికార్డుల నుంచి తొలగించింది. దేవాలయాల భూములు పరిరక్షణలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన జియో ఫెన్సింగ్‌ (ఆన్‌లైన్‌ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు)లో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ భూములు దేవస్థానానివి కావని, వేరే వారివంటూ 2016 డిసెంబరు 14న అధికారిక నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ బాగోతాన్ని గత నెల 27న సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై పూర్తి విచారణకు దేవదాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అర్జునరావు, అడిషనల్‌ కమిషనర్‌ చంద్రకుమార్, దేవదాయ శాఖ విశాఖ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్థన్‌తో తొలుత ఓ కమిటీని ఏర్పాటుచేశారు. అలాగే, 2016లో సింహాచలం దేవస్థానం అప్పటి ఈఓ, ప్రస్తుతం దేవదాయ శాఖ అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌గా ఉన్న కె. రామచంద్రమోహన్‌ను కూడా ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.

ఈ నేపథ్యంలో.. వారం రోజుల కిందట పుష్పవర్థన్‌ ప్రాథమికంగా కొంత విచారణ చేపట్టారు. తాజాగా, విచారణ కమిటీలో దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబను కూడా సోమవారం నియమించారు. దీంతో సోమవారం సింహాచలం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవస్థానం ఈఓ ఎంవి సూర్యకళ నుంచి పలు రికార్డులు తీసుకుని పరిశీలించారు. పూర్తి విచారణ చేపట్టి నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని భ్రమరాంబ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అసిస్టెంట్‌ కమిషనర్లు శాంతి, వినోద్‌కుమార్, అన్నపూర్ణ కూడా రికార్డులను తనిఖీలు చేశారు. 

మరిన్ని వార్తలు