ఒక మహిళ.. రెండు పింఛన్లు

14 Aug, 2020 11:20 IST|Sakshi

వార్డు కార్యదర్శి విచారణలో వెలుగులోకి..

సొమ్ము రికవరీ చేయాలని కమిషనర్‌కు డీఆర్‌డీఏ పీడీ లేఖ 

కర్నూలు (టౌన్‌): నగరంలోని ఓ మహిళ రెండు పింఛన్లు తీసుకుంటున్నట్లు వార్డు కార్యదర్శి విచారణలో బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు రికవరీకి ఆదేశించారు. వివరాలు.. స్థానిక 41వ వార్డు 110 సచివాలయం పరిధిలో నివాసం ఉంటున్న పి.లక్ష్మీదేవి భర్త పి.రామకృష్ణారెడ్డి.. ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తూ రిటైర్డ్‌ అయ్యారు. కొంతకాలానికి అతను మృతిచెందారు. దీంతో అతని భార్య లక్ష్మీదేవికి నెలనెలా ఫ్యామిలీ పింఛన్‌ వస్తోంది. ఈ విషయం దాచిపెట్టి వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో 2011 మంజూరైంది.

ఫ్యామిలీ పింఛన్‌తో పాటు ప్రతినెలా రూ.200 చొప్పున 2017 జూన్‌ వరకు వృద్ధాప్య పింఛన్‌ తీసుకుంది. స్థానికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవల వార్డు సచివాలయ కార్యదర్శి అంతర్గతంగా విచారణ చేశారు. 2011 నుంచి 2017 వరకు రెండు పింఛన్లు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. తప్పుడు ధ్రువ పత్రాలు ప్రభుత్వానికి సమర్పించి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయించి, మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసులు నగరపాలక కమిషనర్‌ డి.కె. బాలాజీకి లేఖ రాశారు. అలాగే ఇదే విషయాన్ని ఏపీఎస్పీ కమాండెంట్‌ దృష్టికి తీసుకెళ్లాలని లేఖలో సూచించారు. 

మరిన్ని వార్తలు