Sirimanostavam 2022: సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు

7 Oct, 2022 18:02 IST|Sakshi
పైడితల్లి అమ్మవారి ఉత్సవ బందోబస్తు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ ఎం.దీపిక

మూడువేల మంది పోలీసుల మోహరింపు

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రత్యేక రూట్‌లు

ఉత్సవానికి ఎన్‌సీసీ, పోలీస్‌ సేవాదళ్‌ సేవలు

ఎస్పీ ఎం.దీపిక 

విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను విజయగవంతంగా నిర్వహించేందుకు మూడువేల మంది పోలీస్‌ బలగాలతో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ నెల 10న జరిగే తొలేళ్ల ఉత్సవం, 11న జరిగే సిరిమానోత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తామని చెప్పారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ టి.త్రినాథ్,  ట్రాఫిక్‌ డీఎస్పీ ఎల్‌.మోహనరావుతో కలిసి గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 

సిరిమానోత్సవం రోజున బందోబస్తును 22 సెక్టార్లుగా విభజించి, సుమారు మూడువేల మంది పోలీసులు రెండు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్పీ, అదనపు ఎస్పీ, 12 మంది డీఎస్పీలు, 63 మంది సీఐ/ఆర్‌ఐలు, 166 మంది ఎస్‌ఐ/ఆర్‌ఎస్‌ఐలు, 11 మంది మహిళా ఎస్‌ఐలు, స్పెషల్‌ పార్టీ సిబ్బందితో సహా సుమారు మూడువేలమంది పోలీస్‌ అధికారులను, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు. మహిళా పోలీసులు, ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలను వినియోగిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్‌బీ సీఐ జి.రాంబాబు, వన్‌టౌన్‌ సీఐ బి.వెంకటరావు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ  
అమ్మవారి చదురుగుడి ఎదురుగా తాత్కాలిక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేస్తామని ఎస్పీ దీపిక తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకుని వచ్చే మార్గంలోనూ, ఇతర ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. బందోబస్తు నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి బాడీ వార్న్‌ కెమెరాలను ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటుచేశామన్నారు. వాటన్నంటినీ కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు.  

సిరిమాను తిరిగే ప్రాంతంలో ముందుగా గుర్తించిన 30 ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.  రూఫ్‌ టాప్‌లలో విధులు నిర్వహించే సిబ్బంది బైనాక్యూలర్స్‌తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేసి పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు.  

200 మందితో ప్రత్యేక నిఘా
నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించడంలో అనుభవజ్ఞులైన 200 మంది క్రైమ్‌ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఈ  బృందాలు ఆలయం రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడతారన్నారు.  

రంగంలోకి బాంబ్‌ స్క్వాడ్‌
అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతో పాటూ ప్రత్యేక బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలను రంగంలోకి దింపుతున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ  బృందాలు ఆలయాలు, బస్టాండ్‌ , రైల్వే స్టేషన్‌ , ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారన్నారు.  అదేవిధంగా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు ఏడు ప్రత్యేక పోలీస్‌ బృందాలు కమాండ్‌ కంట్రోల్‌ వద్ద సిద్ధంగా ఉంటాయన్నారు.   

పార్కింగ్‌ ఇలా..
ట్రాఫిక్‌ నియంత్రణకు వాహనాల పార్కింగ్‌కి సంబంధించి అయోధ్యా మైదానం, రాజీవ్‌స్టేడియం, రామానాయుడు రోడ్డు, పెద్దచెరువు గట్టు, అయ్యకోనేరు గట్టు, పోర్ట్‌ సిటీ స్కూల్‌ రోడ్డు, ఎస్‌వీఎన్‌ నగర్‌ రోడ్డు, ఐస్‌ ఫ్యాక్టరీ కూడలి నుంచి బాలాజీ కూడలి వరకూ గల రింగురోడ్డు ప్రాంతాల్లో ప్రజలు వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు స్థలాలు ఏర్పాటుచేశామన్నారు.  వీఐపీల వాహనాల పార్కింగ్‌కు బొంకులదిబ్బ, టీటీడీ కల్యాణమండపం, గురజాడ కళాక్షేత్రం, కోట ప్రాంతాల్లో పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటుచేసినట్టు వివరించారు. ప్రజలకు సూచనలు చేసేందుకు, సమాచారాన్నిచ్చేందుకు వాహనాలకు పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. సిరిమానోత్సవం రోజున ఫోర్‌ వీలర్స్‌ వాహనాలు ఎంఆర్‌ కళాశాల, కేపీ టెంపుల్, గంటస్తంభం, ట్యాక్సీ స్టాండ్, శివాలయం వీధి, ఘోష ఆస్పత్రి, గుమ్చీ రోడ్డు, సింహాచలం మేడ, సత్యా లాడ్జి ప్రాంతాల్లో ప్రవేసించేందుకు అనుమతి ఉండదన్నారు.  

సిరిమాను తిరిగే ప్రాంతంలో ఎటువంటి తోపులాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలందరూ సిరిమాను తిలకించేలా అనుసంధాన రోడ్లలో బాక్స్‌ సిస్టమ్స్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. అధికారులు 200 వైర్‌లెస్‌ సెట్స్‌ను పోలీసుల వద్ద ఉంచి, ప్రజలకు సూచనలు చేస్తారు. పోలీసు సేవాదళ్‌ భక్తులకు సేవలందిస్తారు. బందోబస్తుకు వచ్చే మహిళా సిబ్బందికి దిశ మహిళా టాయిలెట్స్‌ ఏర్పాటుచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.  

పైడితల్లి అమ్మవారి పండగ శాంతియుతంగా భక్తి వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించాలని, పోలీసుల సహాయాన్ని పొందాల్సిన వారు దేవాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన తాత్కాలిక కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. పోలీసులందరూ భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని, దురుసుగా ప్రవర్తించరాదన్నారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలందించాని ఆదేశించారు.      

సిరిమానోత్సవం రోజున డైవర్షన్స్‌ ఇలా..  

  • పట్టణంలోని వాహనాలు సీఎంఆర్‌ జంక్షన్, గూడ్స్‌షెడ్‌ల మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు.  
  • బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్‌ జంక్షన్, గూడ్స్‌షెడ్‌ మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. 
  • ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. 
  • కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా పట్టణం నుంచి వెళ్లేందుకు వాహనాలకు అనుమతిస్తారు. 
  • జేఎన్‌టీయూ, కలెక్టేరేట్, ఆర్‌అండ్‌బీ, ఎత్తుబ్రిడ్జి, ప్రదీప్‌నగర్‌ మీదుగా పట్టణ బయటకు వాహనాలకు అనుమతిస్తారు. 
  • ప్రదీప్‌నగర్‌ కూడలి, ధర్మపురి రోడ్డు, ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా బయటకు అనుమతిస్తారు. 
మరిన్ని వార్తలు