Sirisha Bandla: గుంటూరు యువతి అరుదైన ఘనత

2 Jul, 2021 15:41 IST|Sakshi

అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తెలుగు యువతి

‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌ​కలో  శిరీష బండ్ల

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కల్పనా చావ్లా, ఇండియన్‌ అమెరికన్‌ సునీతా విలయమ్స్‌ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన చేరారు. అలాగే ఈ ఘనత సాధించిన  తొలి తెలుగు తేజం. రెండవ భారతీయ మహిళ, నాల్గవ భారతీయురాలు కూడా. 

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి శిరీష​ కూడా చోటు సంపాదించుకోవడం విశేషంగా నిలిచింది. రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి హాబ్‌నాబ్ చేయటం! గర్వించదగ్గ విషయమంటూ శిరీష బంధువు రామారావు కన్నెగంటి సంతోషం వ్యక్తం చేశారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో బ్రాన్సన్‌తో కలిసి ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలు దేరుతుందని కంపెనీ ప్రకటించింది.

అంతరిక్ష ప్రయాణాల కోసం గత వారంలో వర్జిన్ గెలాక్టిక్‌ అమెరికాకు చెందిన ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారట. మరోవైపు అమెజాన్ చీఫ్‌ జెఫ్ బెజోస్ ఈ నెల(జూలై) 20న అంతరిక్ష పర్యటనకు పోటీగా ఆయన కంటే  ముందుగానే వర్జిన్ గెలాక్టిక్ రంగంలోకి దిగుతుండటం గమనార్హం.

కాగా 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరారు శిరీష. అప్పటినుండి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక ఉన్నత ర్యాంకులను సొంతం చేసుకుంటూ ఎదిగారు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ చేసిన శిరీషా జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  పట్టా పొందారు.

మరిన్ని వార్తలు