ఆఖరి నిమిషంలో హైకోర్టు బ్రేక్

7 Apr, 2021 03:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: మరో గంటసేపటిలో ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్న సమయంలో మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందా అని అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. గతేడాది మార్చి 7న మొదలైన ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కరోనా పేరుతో సుదీర్ఘకాలంపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 21న పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. 14న నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఇక అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టే సమయంలో కరోనా పేరుతో అదే నెల 15న అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. 

మొదట పరిషత్‌ ఎన్నికలే జరగాల్సి ఉన్నప్పటికీ..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. నిమ్మగడ్డ మాత్రం ఈ ఎన్నికలను గాలికొదిలేశారు. మొదట గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించిన ఆయన అవకాశం ఉన్నప్పటికీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండానే తన పదవీకాలాన్ని ముగించారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని అప్పట్లో ఆగిపోయిన ఎన్నికలను ఆగిన చోట నుంచే తిరిగి కొనసాగించేందుకు వీలుగా ఈ నెల 1న నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీని ప్రకారం 8న (గురువారం) పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అభ్యర్థుల ప్రచారం కూడా ముగిసింది. అయితే అనూహ్యంగా మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్నికలకు బ్రేక్‌ వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 

► రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ స్థానాల్లో 8 చోట్ల కోర్టు కేసులు, తదితర కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 652 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, అందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు మృతి చెందడంతో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా మొత్తం 2,058 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 
► అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కోర్టు కేసులు, తదితర కారణాల వల్ల 375 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 9,672 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థుల మృతి కారణంగా 81 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సిన 7,220 ఎంపీటీసీ స్థానాల్లో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
► ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఇప్పటికే 116 మంది మరణించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు