వీలునామాలకు ఆస్కారంలేదు

14 Jun, 2021 04:41 IST|Sakshi
ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, పీఠాధిపతులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న శివస్వామి

వారసత్వానికే హిందూ మతం పెద్దపీట

మఠాధిపతిగా వెంకటాద్రిస్వామి వైపే ధర్మ పరిరక్షణ సమితి 

ధార్మిక పరిషత్‌కు నివేదిక ఇస్తాం

మీడియాతో శివస్వామి వెల్లడి 

బ్రహ్మంగారి మఠం: బ్రహ్మంగారి మఠం నూతన మఠాధిపతిగా శివైక్యం చెందిన మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామిని ధర్మపరిరక్షణ సమితి నిర్ణయించిందని గుంటూరు జిల్లా శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారి మఠంలో సమితి సభ్యులు, వివిధ మఠాలకు చెందిన 20 మంది పీఠాధిపతులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మఠాధిపతి ఎంపికలో వారసత్వానికే హిందూ మతం ప్రాధాన్యతనిస్తుందని.. వీలునామాలకు ఆస్కారంలేదని ఆయన తేల్చిచెప్పారు. ధర్మపరిరక్షణ సమితి సభ్యులమైన తాము ఏ మఠంలో సమస్యలున్నా వాటిని పరిష్కరించడమే తమ బాధ్యత అన్నారు. ఇందులో భాగంగా ధర్మపరిరక్షణ సమితి భక్తులు, కందిమల్లాయ్యపల్లె గ్రామస్తులు, ఉప పీఠాలు, వివిధ మఠాధిపతులతో సంప్రదింపులు జరపగా అధిక శాతం వారసత్వానికే ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, వారి సలహాలు, సూచనలు ఇచ్చారని శివస్వామి చెప్పారు. ధర్మపరిరక్షణ సమితి కూడా వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించాలని భావిస్తోందని.. ఇదే విషయంపై దేవదాయశాఖ పరిధిలో ఉన్న ధార్మిక పరిషత్‌కు నివేదిక ఇస్తామన్నారు. 

మఠాధిపతి మృతిపై అనుమానాలు
ఇదిలా ఉంటే.. మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని శివస్వామి తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనపై ఒత్తిడి రావడంతోనే మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారని వివరించారు. అలాగే, మఠాధిపతి నివాసంలో పనిచేస్తున్న చంద్రావతమ్మ అనే మహిళ ఇంతవరకు కనిపించకపోవడంపై శివస్వామి అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాక.. మఠంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయని.. వీటన్నింటిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం మఠాధిపతి నియామకాన్ని పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 

మరిన్ని వార్తలు