రక్షాబంధన్‌ రోజు విషాదం 

23 Aug, 2021 05:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం 

మృతుల్లో అక్కాతమ్ముడు 

మరొకరి పరిస్థితి విషమం 

విశాఖ జిల్లాలో అనారోగ్యంతో అక్కాతమ్ముడి మృతి 

రాపూరు/ఆత్మకూరు/చెన్నూరు: రక్షాబంధన్‌ రోజు రాష్ట్ర రహదారులు రక్తమోడాయి. వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళ్తే.. నెల్లూరు మూలాపేటకు చెందిన మల్లేశ్వరరావు (35), రాము (22) బైక్‌పై పెంచలకోన క్షేత్రంలో మిత్రుడి పిల్లలకు తలనీలాలు సమర్పించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాపూరు మండలం రామకూరు ఎస్టీ కాలనీ వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్నారు. మల్లేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. రామును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.     

ఆగి ఉన్న లారీని ఢీకొని.. 
రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలో నెల్లూరు–ముంబై రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం పడకండ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (35) ఆత్మకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నెల్లూరుపాలెం వద్ద బోయలచిరువెళ్లకు చెందిన కృష్ణయ్య (67) లిఫ్ట్‌ అడిగాడు. ఇద్దరూ బైక్‌పై వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వైఎస్సార్‌ జిల్లాలో అక్కాతమ్ముడు 
వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు పెన్నా నది బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాపాడు మండలం నక్కలదిన్నె అనంతపురం గ్రామానికి చెందిన చెరువు మల్లేష్‌ (45), ఆయన సోదరి ఇండ్ల వెంకట లక్షుమ్మ (47) మృతి చెందగా మేనకోడలు లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. చెరువు మల్లేష్‌ రాఖీ పర్వదినం సందర్భంగా కడప అల్మాస్‌పేటలో ఉంటున్న తన అక్క లక్షుమ్మ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి అక్కతోపాటు మేనకోడలిని తీసుకుని బయలుదేరాడు. చెన్నూరు పెన్నాబ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కిందపడడంతో మల్లేష్‌ చేయి, తలకు, లక్షుమ్మకు తలతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. లావణ్య కాలు తెగిపడి తీవ్ర రక్తస్రావమైంది. వీరిని స్థానికులు, పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వెంకట లక్షుమ్మ, మల్లేష్‌లు మృతి చెందారు. లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

అనారోగ్యంతో అక్క మృతి.. ఆ బాధతో  తమ్ముడి కన్నుమూత 
అనకాపల్లి టౌన్‌: 75 ఏళ్లకుపైగా అనుబంధం వారిది. చివరకు మరణంలోనూ ఒకరిని ఒకరు వీడలేకపోయారు. ఇద్దరూ రక్షాబంధన్‌ రోజునే కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో అక్క రాజా సాగి లలితాదేవి (85) ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె తమ్ముడు ఎస్‌ఆర్‌ఎన్‌ఎంఆర్‌ రాజు (76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని శారదా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. లలితాదేవి తన భర్త మృతి చెందాక కుమార్తె పద్మినీరాణితో కలసి తమ్ముడు రాజు (76)తోనే 30 ఏళ్లుగా ఉంటున్నారు. అక్క మరణంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి రాజు ఇంటికి చేరుకున్నారు. తర్వాత భోజనం చేసి బంధువులతో ఫోన్‌లో తన అక్క మృతి విషయం మాట్లాడుతూ గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన చాలాకాలంగా గుండె సంబంధిత వ్యాధితో 
బాధపడుతున్నారు.  

మరిన్ని వార్తలు