‘సీతాకోక’ నెలవు.. జీవ వైవిధ్య కొలువు

11 Oct, 2020 04:48 IST|Sakshi

సీతాకోకచిలుకలు చూడు..! ఎన్నో రంగుల రెక్కలు చూడు.!

మూలపాడు ప్రాంతంలో ఆరు కొత్త జాతులు

బిగ్‌ బటర్‌ఫ్లై మంత్‌–2020 సర్వేలో కనుగొన్న పర్యావరణవేత్తలు 

కొత్త వాటితో కలిపి 62కి చేరుకున్న జాతులు

జీవ వైవిధ్యంతో కళకళలాడుతున్న కొండపల్లి అటవీ ప్రాంతం

సాక్షి, అమరావతి: ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎలా ఉందనేది అక్కడున్న సీతాకోకచిలుకల గమనం ప్రతిబింబిస్తుంది. వీటి ఉనికి ఆ ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతను తేటతెల్లం చేస్తుంది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల వాటి సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతున్న తరుణంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంత పరిధిలో జీవ వైవిధ్యం మెరుగ్గా ఉన్నట్టు పర్యావరణ వేత్తలు గుర్తించారు. ఈ అటవీ ప్రాంత పరిధిలోని మూలపాడులో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

మన దేశంలోనూ సర్వే..
విదేశాల్లో మాదిరిగా జీవ వైవిధ్యాన్ని తెలుసుకునేందుకు గత సంవత్సరం నుంచి భారత్‌లోనూ పర్యావరణ వేత్తలు సీతాకోకచిలుకలపై సర్వే ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 15 వరకూ బిగ్‌ బటర్‌ఫ్‌లై మంత్‌–2020గా ప్రకటించి సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొండపల్లి అటవీ ప్రాంతంలో 15 కి.మీ. పరిధిలో స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారంతో నేషనల్‌ బట్టర్‌ఫ్లై కన్సర్వేషన్‌ సొసైటీ సభ్యులు దాసి రాజేష్‌ వర్మ, బండి రాజశేఖర్‌ బృందం సర్వే నిర్వహించి 20 రోజుల్లోనే ఆరు రకాల కొత్త జాతులు ఇక్కడ ఉన్నట్టు గుర్తించింది. వీరు మూలపాడు వద్ద కొత్తగా 6 సీతాకోక చిలుక జాతులను కనుగొన్నారు. అవి 1.ట్రై కలర్‌ పైడ్‌ ఫ్లాట్, 2.కంప్లీట్‌ పెయింట్‌ బ్రష్‌ స్విఫ్ట్, 3.బాంబూ ట్రీ బ్రౌన్, 4.డింగీ లైన్‌ బ్లూ, 5.పాయింటెడ్‌ సిలియేట్‌ బ్లూ, 6.గోల్డెన్‌ ఏంజిల్‌. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే చెట్లు, వన్యప్రాణులు ఎక్కువగా ఉండటం వల్లే కొత్త జాతులు ఇక్కడకు వస్తున్నట్టు సర్వే బృందం గుర్తించింది. కొత్తగా కనుగొన్న జాతులతో కలిపి ఈ ప్రాంతంలో ఉన్న సీతాకోకచిలుక జాతుల సంఖ్య 62కి చేరింది.

ఈ ప్రాంత గొప్పతనం..
విజయవాడకు సమీపంలో ఇంతటి జీవ వైవిధ్యం ఉన్న అటవీ ప్రాంతం ఉండటం విశేషం. కాలుష్యం, పట్టణీకరణ, వాతావరణ మార్పుల వల్ల ఇక్కడా సీతాకోకచిలుకల సంఖ్య గతం కంటె తగ్గుతున్నా కొత్త కొత్త జాతులు మనుగడ సాగిస్తున్నాయి. ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
– దాసి రాజేష్‌ వర్మ, బట్టర్‌ఫ్‌లై కన్సర్వేషన్‌ సొసైటీ సభ్యుడు

మారుతున్న పరిస్థితుల వల్లనే..
ఇంతకుముందు ఈ జాతులు ఇక్కడ కనపడేవి కాదు. మారిన వాతావరణ పరిస్థితులను బట్టి అవి ఈ ప్రాంతానికి వస్తున్నట్టు గుర్తించాం. గత సంవత్సర కాలంగా ఈ ప్రాంతంలో పలు కొత్త జాతులను కనుగొన్నారు. ఇక్కడున్న చెట్లు, వన్యప్రాణుల వైవిధ్యం వల్లే ఇవి ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయి.
– బి.లెనిన్‌ కుమార్, డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్, కొండపల్లి రిజర్వుడ్‌ ఫారెస్ట్‌ 

మరిన్ని వార్తలు