‘ప్రైవేటు’ నిర్వాకం.. ఇదేంటని ప్రశ్నిస్తే వైద్యం బంద్‌

30 Apr, 2021 11:50 IST|Sakshi
కోవిడ్‌ పేషెంట్లను చేర్చుకోబోమని పోస్టర్‌ను అతికిస్తున్న ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్ప్రత్రి సిబ్బంది  

కడపలోని 6 ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వాకం  

కడప రూరల్‌: కోవిడ్‌ బాధితులకు చికిత్స చేసే విషయంలో అక్రమాలను అధికారులు ప్రశ్నించినందుకు నిరసనగా వైఎస్సార్‌జిల్లా కేంద్రం కడపలోని 6 ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రులు వైద్యం నిలిపేశాయి. ఈ ఆస్పత్రుల్లో చికిత్సకు కోవిడ్‌ బాధితుల నుంచి రోజుకు రూ.50 వేలు, రూ.లక్షకు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్‌ హరికిరణ్‌.. జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ తదితరులతో ఆ ఆస్పత్రుల్లో తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు, లోపాలు వెలుగుచూశాయి.

ఆరోగ్యశ్రీ కోవిడ్‌ పేషెంట్ల వద్ద డబ్బులు అధికంగా వసూలు చేసినట్లు తేలడంతో రెండు ఆస్పత్రులకు జరిమానా వేశారు. అనంతరం కూడా కొన్ని ఆస్పత్రుల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం కడపలోని ప్రైవేటు కోవిడ్‌ ఆస్పత్రుల యజమానులు సమావేశమయ్యారు. అధికారులు అక్రమాల గురించి ప్రశ్నించడం జీర్ణించుకోలేకపోయిన వారు.. కోవిడ్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులను అడ్మిట్‌ చేసుకోకూడదని, వైద్యసేవలు అందించకూడదని నిర్ణయించారు. ఆస్పత్రులను మూసేసి, కోవిడ్‌ పేషెంట్లను చేర్చుకోబోమంటూ ముఖద్వారాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇది సరికాదు..: చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి 
రాయచోటి: వైఎస్సార్‌ జిల్లా పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘కరోనా కేసులను చూడం..’ అంటూ బోర్డులు పెట్టడం సరికాదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయంపై గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ఆస్పత్రులను శిక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు బయట మార్కెట్‌కు తరలుతున్నాయని, తద్వారా నిజమైన పేదలకు అవి అందడం లేదనే విజిలెన్స్‌ తనిఖీలు జరిపారని, ఇవి కక్షపూరితం కాదని చెప్పారు. పేదలకు ఆరోగ్య సహాయ çసహకారాలు అందాల్సిన సమయంలో వైద్యులు చెడ్డపేరు మూటగట్టుకునే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రాయచోటిలో కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చిన అమరావతి ఆస్పత్రిని శానిటేషన్‌ పేరుతో మే 1 వరకు మూసివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. దీనిపై పునరాలోచించాలని కోరారు. తప్పుచేసిన ఆస్పత్రి యజమానులు, వైద్యులపైన మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని ఆయన గుర్తుచేశారు.

చదవండి: ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్‌ ఆఫీసర్లు
‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు