Sreesatyasai District: ఆరుగురు విద్యార్థుల సస్పెన్షన్‌

4 May, 2022 10:25 IST|Sakshi

నల్లమాడ: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్‌ 30వ తేదీన పాఠశాలలోని తరగతి గదిలో కొందరు విద్యార్థులు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై  మంగళవారం డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ మీనాక్షి, ఏడీ రామకృష్ణ, ఎంఈఓ వేమనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ... ఘటనపై సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని తెలిపారు.  

ఇంతకీ ఏం జరిగిందంటే... ?
ఏప్రిల్‌ 30న ఎస్‌ఏ పరీక్షలు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు ఓ తరగతిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, డెస్క్, వైర్‌కుర్చీ(చైర్‌) ధ్వంసం చేశారు. ఆ రోజు విధుల్లో ఉన్న ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం శ్యాంప్రసాద్‌ ఫిర్యాదు మేరకు హెచ్‌ఎం రమణప్ప మరుసటి రోజు ఘటనకు బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. తమ పిల్లలు చేసిన పనికి తాము క్షమాపణలు కోరుతున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూసుకోవడంతో పాటు ధ్వంసమైన ఫర్నీచర్‌ మరమ్మతులకు అయ్చే ఖర్చు తామే భరిస్తామని చెప్పడంతో అప్పట్లో సమస్య సద్దుమణిగింది.

తాజాగా ఈ నెల 2న ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. అయితే అది నల్లమాడ ఉన్నత పాఠశాలలో జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్‌చల్‌ చేశాయి. దీంతో ఏప్రిల్‌ 30న నల్లమాడ పాఠశాలలో జరిగిన ఘటన మళ్లీ తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో డీఈఓ పాఠశాలకు విచ్చేసి విచారణ చేపట్టారు. సామగ్రి ధ్వంసం చేసిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. విద్యార్థులు తరగతి గదిలోని సామగ్రి ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని తేలడంతో డీఈఓ వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఆ విద్యార్థులను సస్పెండ్‌ చేయాలని హెచ్‌ఎం రమణప్పకు ఆదేశాలిచ్చారు.  

(చదవండి: వదినతో గొడవ.. పల్సర్‌ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..)

మరిన్ని వార్తలు