చదువు పూర్తవగానే ఉద్యోగం 

4 Aug, 2022 04:43 IST|Sakshi
ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఉన్నత విద్యామండలి, సేల్స్‌ ఫోర్స్‌ ప్రతినిధులు

అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్య శిక్షణ 

సేల్స్‌ ఫోర్స్‌ సంస్థతో ఉన్నత విద్యా మండలి ఒప్పందం 

ఏటా 2 లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న కాలంలో ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగావకాశాలను (ప్లేస్‌మెంట్స్‌) అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి తన కాలేజీ చదువులు ముగించి బయటకు వస్తూనే ఉద్యోగావకాశాలకు అనుగుణమైన పూర్తి నైపుణ్యాలను కలిగి ఉండేలా, ప్రపంచంలో ఇతరులతో పోటీపడి అవకాశాలను దక్కించుకునేలా రాష్ట్ర విద్యార్థులను సిద్ధం చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. ఇందులో భాగంగా విద్యార్థులకు వర్చ్యువల్‌ శిక్షణకు సంబంధించి బుధవారం విజయవాడలోని ఏపీటీఎస్‌ కార్యాలయంలో సేల్స్‌ ఫోర్స్‌ సంస్థతో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 3.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ద్వారా 1.62 లక్షల మందికి సర్టిఫికెట్‌ కోర్సులలో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఫ్యూచర్‌ స్కిల్స్, నాస్కామ్‌ తదితర సంస్థల ద్వారా వేలాది మందికి వివిధ నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత సేల్స్‌ ఫోర్స్‌ సంస్థ ద్వారా 70 వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, సర్టిఫికేషన్‌ కోర్సులు ఉచితంగా అందుబాటులో రానున్నాయని చెప్పారు.

ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న భయాలు ఉన్నా, దానివల్ల దేశ యువతకు ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయని వివరించారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, ఫ్యూచర్‌ స్కిల్స్‌ హెడ్‌ నవనీత్‌ సమయార్, ప్రతినిధులు శ్రీదేవి, సతీష్, సేల్స్‌ ఫోర్స్‌ ఎండీ సంకేత్, ట్రయిల్‌ హెడ్‌ అకాడమీ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ సిమ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు