ఆర్బీకేలకు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డు 

21 Mar, 2021 03:30 IST|Sakshi
ఆర్‌బీకేలకు ప్రకటించిన స్కోచ్‌ గోల్డ్‌ అవార్డు

‘స్కోచ్‌’ చరిత్రలో స్వర్ణ పురస్కారం ఇవ్వడం ఇదే ప్రథమం 

ఇప్పటివరకు మెరిట్‌ అవార్డులు మాత్రమే ఇస్తున్న స్కోచ్‌ 

ఆర్‌బీకే సేవలకు జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు

సాక్షి, అమరావతి: సాగులో మెళకువలు, సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికైన రైతు భరోసా కేంద్రాలను గతేడాది మే 30న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన 10,725 ఆర్‌బీకేలు, 154 ఆర్‌బీకే హబ్‌ల ద్వారా గడచిన 11 నెలలుగా వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు సేవలందుతున్నాయి.

దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను స్కోచ్‌ సంస్థకు సమర్పించారు. ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వాటి ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలు రైతులకు అందిస్తున్న సేవల వివరాలను వ్యవసాయ శాఖ సమర్పించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్‌బీకేలు అందిస్తున్న సేవలను గుర్తించిన స్కోచ్‌ సంస్థ వైఎస్సార్‌ ఆర్‌బీకేలకు బంగారు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని శనివారం ఆ సంస్థ వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించింది. త్వరలో ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అందుకోనున్నారు. 

విత్తు నుంచి విపణి వరకు.. 
విత్తు నుంచి విపణి వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు ఉత్పాదక సేవలందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌బీకేలు వ్యవసాయ, అనుబంధ రంగాలైన ఉద్యాన, పట్టు, పాడి, ఆక్వా రంగాల సుస్థిరాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. వన్‌స్టాప్‌ షాప్‌ కింద ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కియోస్‌్కల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతోపాటు ఆక్వా, పాడి రైతులకు అవసరమైన సీడ్, ఫీడ్‌ కూడా అందిస్తున్నారు.

ఈ కేంద్రాల ద్వారా పొలం బడులు, తోట బడులు, మత్స్య సాగుబడులు, పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తూ రైతులకు ఎప్పటికప్పుడు అవసరమైన శాస్త్ర, సాంకేతిక సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆర్‌బీకేల్లో  లైబ్రరీలు ఏర్పాటు చేయడంతో పాటు వైఎస్సార్‌ రైతు భరోసా మాసపత్రికను తీసుకొస్తున్నారు. ఇటీవలే దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ఆర్‌బీకే యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించారు.

మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌ నుంచి గ్రామ స్థాయిలోనే పంటల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఆర్‌బీకే స్థాయిలో 2,587 గొడౌన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు అద్దెకు సాగు యంత్రాలను అందుబాటులో తీసుకొచ్చే లక్ష్యంతో 10,285 ఆర్‌బీకేల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు (యంత్ర సేవా కేంద్రాలు)తో పాటు 151 హైటెక్‌ హై వాల్యూ మెకనైజేషన్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో 147,  జిల్లా స్థాయిలో 11 వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను తీసుకొస్తున్నారు.

అలాగే 9,899 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, 8,051 ఆటోమేటిక్‌ కలెక్షన్‌ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటికి అనుబంధంగా జనతా బజార్లు, కేటిల్‌ షెడ్స్, ఆక్వా ఇన్‌ఫ్రా ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా వ్యవసాయ అనుబంధ సేవలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్‌బీకేల ద్వారా అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. సాధారణంగా స్కోచ్‌ సంస్థ డిపార్టుమెంట్లకు మెరిట్‌ అవార్డులిస్తుంది. కానీ.. ఆర్‌బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రశంసలు జల్లు కురిపించడమే కాకుండా ఏకంగా గోల్డ్‌ మెడల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇది సీఎం మానస పుత్రికైన రైతు భరోసా కేంద్రాలకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు అన్నారు. 

మరిన్ని వార్తలు