ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా

30 Jul, 2020 02:44 IST|Sakshi

ఈ రెండు పథకాలతో కోటి మందికి పైగా మహిళలకు లబ్ధి

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఏడాదికి రూ.11 వేల కోట్లకుపైగా సాయం చేస్తాం

నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు ఖర్చు చేస్తాం

వారి జీవితాలను మార్చేందుకు ఈ సహాయం ఉపయోగపడాలి

ఇందుకు బ్యాంకర్లు కూడా తోడ్పాటు అందించాలి

అమూల్‌ తరహాలో భారీ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు

పాడి పరిశ్రమాభివృద్ధికి అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు చేసుకోబోతున్నాం. ఈ కంపెనీలు, బ్యాంకుల సహాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం.
– సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న అర్హత కలిగిన మహిళలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాలు అందిస్తామని తెలిపారు. వైఎస్సార్‌ ఆసరాతో 90 లక్షలకుపైగా ఉన్న డ్వాక్రా  మహిళలకు అండగా నిలుస్తామని చెప్పారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 211వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం
► క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకర్లు ఏపీకి సహకరిస్తున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల వివరాలను పంపాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించాం. ఈ ఏడాదికి సంబంధించినవి కూడా (2019–20) రైతులకు చెల్లిస్తాం. 
► ప్రభుత్వం ఒక పథకం ప్రారంభించింది అంటే.. దాని మీద విశ్వాసం, నమ్మకం కలగాలి. దీన్ని అమలు చేయకుంటే ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. మేం చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం. చెప్పిన ప్రకారం అన్నీ నెరవేరుస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో మహిళల సాధికారిత దిశగా రెండు పథకాలను ప్రారంభిస్తున్నాం.
► 25 లక్షల మహిళలకు వైఎస్సార్‌ చేయూత అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య అర్హత ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.75 వేలు సాయం అందిస్తాం. ఈ సహాయం ద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం. 

మహిళలకు ఆదాయం తెచ్చే కార్యక్రమాలు చేపట్టాలి
► సెప్టెంబర్‌లో స్వయం సహాయక సంఘాలకు రూ.6,700 కోట్లకు పైగా ఇవ్వబోతున్నాం. మొత్తమ్మీద ఏటా రూ.11 వేల కోట్ల చొప్పన, నాలుగేళ్ల పాటు ఈ రెండు పథకాలకు రూ.44 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
► 90 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్‌ ఆసరా ద్వారా, 25 లక్షల మంది మహిళలకు వైఎస్సార్‌ చేయూత కింద.. మొత్తంగా కోటి మందికి పైగా సహాయం లభిస్తుంది.
► అమూల్‌ తరహాలో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటాం. ఈ కంపెనీలు, బ్యాంకర్లు ఒక తాటిమీదకు వచ్చి, ఈ మహిళలకు ఆదాయాలను తెచ్చే కార్యక్రమాలను చేపట్టాలి. గ్రామాల్లో మెరుగైన ఆర్థిక వ్యవస్థలను తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి.
► కోవిడ్‌ నివారణా చర్యలను పగడ్బందీగా చేస్తున్నాం. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నాం. దేశంలోనే ఇది అత్యధికం. ప్రతి మిలియన్‌కు 32 వేల మందికిపైగా పరీక్షలు చేస్తున్నాం. క్లస్టర్‌ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి 90 శాతానికి పైగా పరీక్షలు చేస్తున్నాం. 
► ఈ సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్‌ సీజీఎం సుధీర్‌కుమార్, సీఎస్‌ నీలం సాహ్ని, పలు శాఖల ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌ గార్డ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.  

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం 
రైతులు, మహిళలు, ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని వర్గాల వారికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు బ్యాంకర్లు పూర్తి సహాయ, సహకారాలు అందించాలి.
– డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

నగదు కోసం బ్యాంకుకు రానక్కర్లేదు
► నగదు కోసం ప్రజలు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేదు. అన్ని ఏటీఎం కేంద్రాల్లో అవసరాల మేరకు నగదును ఉంచుతున్నాం. దీని వల్ల భౌతిక దూరం పాటించడానికి వీలుంటుంది. ప్రజలు తప్పనిసరి అయితేనే బ్యాంకులకు రావాలి. వైఎస్సార్‌ కడప జిల్లాలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. 
► వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుబ్రతో దాస్, ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ 

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల కోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం మహిళా సాధికారితలో మైలు రాయి కావాలి. మహిళల జీవితాలను మార్చడానికి ఈ సహాయం ఉపయోగపడాలి. దీని కోసం బ్యాంకర్లు ముందుకు రావాలి.

మరిన్ని వార్తలు