తిరుమల ఘాట్‌ రోడ్లలో కొండచరియల పరిశీలన

3 Dec, 2021 05:51 IST|Sakshi
ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను పరిశీలిస్తున్న టీటీడీ అధికారులు, ఐఐటీ నిపుణులు

ఐఐటీ నిపుణుల రాక

తిరుమల: ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌ రోడ్లలోని కొండచరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అలిపిరి, రెండో ఘాట్‌ రోడ్‌లో కొండచరియలను ఢిల్లీ ఐఐటీ నిపుణులు కేఎస్‌ రావు, చెన్నై ఐఐటీ నిపుణులు శ్రీ ప్రసాద్, టీటీడీ పూర్వపు చీఫ్‌ ఇంజనీర్, సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి బృందం గురువారం మధ్యాహ్నం పరిశీలించింది. కేఎస్‌ రావు మాట్లాడుతూ .. ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగం ఘాట్‌ రోడ్లకు ఇరువైపులా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి బండరాళ్లకు ఫెన్సింగ్, రాక్‌ బోల్టింగ్, షాట్‌ క్రీటింగ్, బ్రస్ట్‌ వాల్స్‌ ఏర్పాటు చేసిందన్నారు.

శేషాచల కొండల్లో, ఘాట్‌ రోడ్లలో వర్షపు నీరు నిలువకుండా వెళ్లడానికి అదనపు కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అప్‌ ఘాట్‌ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గుర్తించామన్నారు. ప్రస్తుతానికి రెండో ఘాట్‌ రోడ్డులో అక్కడక్కడా మరమ్మతులు చేసి లింక్‌ రోడ్డు ద్వారా మోకాళ్ల మెట్టు చేరుకుని అక్కడి నుంచి తిరుమలకు చేరుకోవచ్చన్నారు. రెండు, మూడు రోజుల్లో టీటీడీకి సమగ్ర నివేదిక అందజేస్తామని తెలియజేశారు. టీటీడీ చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు, ఎస్‌ఈ–2 జగదీశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు