తగ్గుతున్న కేసులు.. కుదుటపడుతున్న బతుకులు

22 Jun, 2021 08:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనా తగ్గుతోందనే సంకేతాలతో చిరు వ్యాపారులు, శ్రామికుల్లో ఆనందం

నవోదయం దిశగా శ్రమజీవుల అడుగులు

పగటిపూట కర్ఫ్యూ సడలింపుల వేళ శ్రమజీవుల బతుకు చిత్రంపై ప్రత్యేక కథనం

విజయవాడ భవానీపురానికి చెందిన పరిమళ సత్యవతికి గుండె నిబ్బరం పెరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం.. పగటిపూట కర్ఫ్యూ సడలిస్తున్నారనే సంకేతాలు రావడమే దీనికి కారణం. గుడి వద్ద కొబ్బరి కాయలు అమ్మితే వచ్చే ఆదాయంతోనే నలుగురు సభ్యుల ఆ కుటుంబం బతుకుతోంది. కరోనా పుణ్యమాని ఏడాదిగా కొట్టు తెరిచే వీల్లేకుండా పోయింది. దమ్మిడీ ఆదాయం లేదు. ఇలాంటి చీకటి రోజుల్లోనూ తమ కుటుంబం అప్పుల పాలవ్వకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ పథకంతో తమను ఆదుకుందనే కృతజ్ఞత ఆమె మాటల్లో వ్యక్తమైంది. ఇంటిముందుకే వచ్చిన రేషన్‌ బియ్యంతో పొట్ట నింపుకున్నామని చెప్పిందామె. త్వరలోనే మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని.. తాము కోలుకుంటామని సత్యవతి విశ్వాసం వ్యక్తం చేసింది.

చిగురిస్తున్న ఆశలు
కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు, పగటిపూట కర్ఫ్యూ సడలిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని చిరు వ్యాపారుల పరిస్థితిని ‘సాక్షి’ బృందం పరిశీలించింది. ఏడాదికి పైగా వెంటాడుతున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోందనే ఆనందం కాయకష్టం చేసేవాళ్లలో స్పష్టంగా కన్పిస్తోంది. తోపుడు బండితో పొట్టపోసుకునే వాళ్లు, వీధివీధినా సైకిల్‌పై తిరిగి పండ్లు అమ్ముకునే వారు, రోడ్డు పక్కన టీ దుకాణం నడుపుకునే చిరు వ్యాపారులు.. ఇలా అందరిలోనూ త్వరలోనే కోలుకుంటామనే భరోసా కనిపిస్తోంది. ‘ఇన్నాళ్లకు పండగొచ్చినంత సంతోషంగా ఉందయ్యా’ అని చెప్పింది విజయవాడలోని బందరు రోడ్డులో టీకొట్టు నడిపే లక్ష్మి. ‘మళ్లీ పనికి పిలుస్తున్నారయ్యా... పట్నం వెళ్తాం’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది గుంటూరు జిల్లాలోని ఓ పల్లెకు చెందిన రేణుక. 

సడలని ధైర్యం
అరకొర వ్యాపారం.. తెచ్చిన సరుకంతా పాడవడంతో తెచ్చిన పెట్టుబడి అప్పుగానే మిగిలిపోయిందని ఏడాది అనుభవాన్ని చెప్పాడు నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనకయ్య. చిన్న హోటల్‌ నడిపే కనకయ్య ప్రతిరోజూ చేసిన వంటలు మిగిలిపోయి నష్టం జరిగిందన్నాడు. కరోనా తగ్గుతోందనే సంకేతాలు వస్తుండటంతో ఇప్పుడిప్పుడే కస్టమర్లు వస్తున్నారని చెప్పాడు. ఇక్కడ ఆసక్తికరమైన అంశమేమంటే ఆదాయం కోల్పోయినా.. ఆత్మ నిబ్బరం మాత్రం దెబ్బతినలేదని చాలామంది చెప్పారు. కష్టకాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పుణ్యమా అని బతికేందుకు కొంత డబ్బు అందిందని పలువురు చెప్పారు. మల్లేశ్వరరావు అనే రైతు కుటుంబానికి రైతు భరోసాతో పాటు పిల్లలను బడికి పంపినందుకు వచ్చే మొత్తం చేతికి అందింది. ఈ మధ్య ఆటో నడిపే కొడుక్కి సైతం ప్రభుత్వ సాయం అందిందని చెప్పాడు. 

బతుకు బాటలు తెరుచుకుంటున్నాయ్‌
సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న నమ్మకం పెరగడంతో చిరు వ్యాపారులు తిరిగి బతుకు బాటలు వేసుకుంటున్నారు. ఏడాదిగా మూలన పడ్డ తోపుడు బండ్లకు, రోడ్డు పక్కన హోటళ్లకు మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమయ్యారు. సత్యనారాయణపురంలో రోజుకు రూ.1,500 వరకూ సంపాదించే టీకొట్టు వ్యాపారి తన షాపును తీర్చిదిద్దాడు. భవానీపురంలో జయలలిత తన తోపుడు బండికి చిన్నా చితక రిపేర్లు పూర్తి చేయించి సిద్ధంగా పెట్టుకోవడం కనిపించింది. ఏలూరు దగ్గర పల్లెటూరికెళ్లిన రోజు కూలీలు మళ్లీ సింగ్‌నగర్‌లో అద్దె ఇల్లు వెతుక్కోవడం దర్శనమిచ్చింది. ‘నిర్మాణ పనులు మొదలు పెడదామని సేటు పిలిచాడు’ అని చెప్పాడు రోజువారీ కూలీ రాంబాబు.

మంచి రోజులొస్తున్నాయ్‌
68 ఏళ్ల వయసులోనూ సైకిల్‌పై ఊరూరూ తిరుగుతూ పండ్లు అమ్ముకుంటున్నాను. లాక్‌డౌన్‌ ముందు వరకూ రోజుకు రూ.వెయ్యి వరకూ గిట్టుబాటు ఉండేది. ఏడాదిగా పరిస్థితి తల్లకిందులైంది. తిండికీ, మందులకు ప్రభుత్వం పథకాల ద్వారా వచ్చే సొమ్ముతో నెట్టుకొచ్చాం. ఇప్పుడు మళ్లీ మంచి రోజులొస్తున్నాయని ఆనందంగా ఉంది.– సయ్యద్‌ దాదాసాహేబ్, అరటి పండ్ల వ్యాపారి, రవీంద్రపాడు గ్రామం

కష్టం రాకుండా కరుణించాలి
కరోనా ఏమో గానీ ఇస్త్రీ కొట్టుకు ఏడాదిగా తిప్పలొచ్చాయి. ఈ కొట్టు ఉంటేనే ఇంటిల్లిపాదికీ తిండి దొరికేది. కరోనా పోతోందనే తియ్యటి కబురు విన్నాను. దీని పీడ విరగడైతే కష్టాలు తగ్గుతాయి. మళ్లీ ఈ కష్టం రాకుండా చూడాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ కష్టంలోనూ జగన్‌ సర్కార్‌ మమ్మల్ని ఆదుకుంది. – లింగాల ప్రసాద్, దోబీ, తాడేపల్లి

భరోసా పెరుగుతోంది
కరోనా వల్ల హోటల్‌ వ్యాపారం తలకిందులైంది. షాపు తెరవకున్నా పని చేసేవాళ్ళకు డబ్బులివ్వాల్సి వచ్చింది. చేసిన వంటంతా పాడైనా నష్టాన్ని భరించి అప్పుల పాలయ్యాం. లాక్‌డౌన్‌ సడలిస్తున్న సంకేతాలు కొంత భరోసా పెంచుతున్నాయి. కరోనా తగ్గితే పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడమే మంచిది. – అనిమిరెడ్డి వెంకట్, హోటల్‌ వ్యాపారి, కృష్ణలంక

మరిన్ని వార్తలు