మీటర్లతో మిగులుతున్న విద్యుత్‌

10 Aug, 2022 05:12 IST|Sakshi

డీబీటీ కింద వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు

శ్రీకాకుళంలో సత్ఫలితాలిస్తున్న పైలెట్‌ ప్రాజెక్ట్‌ 

మీటర్లు లేనప్పుడు 2020–21లో వినియోగం 101.51 ఎంయూలు

మీటర్లు పెట్టిన తరువాత 2021–22లో వినియోగం 67.76 ఎంయూలే

మొత్తం 2,330 సర్వీసులు పెరిగినా 33.75 ఎంయూల విద్యుత్‌ ఆదా 

రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు మీటర్లు బిగిస్తే భారీగా విద్యుత్‌ ఆదా 

ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్న సీఎం ఆదేశంతో ఇంధనశాఖ కార్యాచరణ

సాక్షి, అమరావతి: ‘రైతులు, ప్రజా సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండడుగులు వేశారు. నేను నాలుగడుగులు వేస్తాను..’ అని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా ఉచిత విద్యుత్తు పథకం పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించారు. ఉచిత విద్యుత్‌ పథకం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని, దాన్ని రైతుల హక్కుగా మార్చాలని సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రైతులపై ఒక్క రూపాయి భారం పడకుండా.. వారికి శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. భారీగా విద్యుత్‌ను ఆదా చేస్తోంది. 

సర్వీసులు పెరిగినా మిగిలిన విద్యుత్‌ 
రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా శ్రీకాకుళం జిల్లాలో 2021–22 నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ మీటర్లు అమర్చకముందు.. అంటే 2020–21లో వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు 101.51 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాయి. 2021 మార్చి నాటికి జిల్లాలో 26,063 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. 2021–22లో వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు 67.76 మిలియన్‌ యూనిట్లే వినియోగించాయి. 2022 మార్చి నాటికి జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 28,393కు చేరింది. జిల్లాలో ఏడాదిలో 2,330 సర్వీసులు పెరిగినా.. మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయింది. ఇదే విధంగా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే భారీగా విద్యుత్‌ ఆదా అవుతుందని పైలెట్‌ ప్రాజెక్ట్‌ నిరూపించింది. 

రైతులకు హక్కుగా ఉచిత విద్యుత్‌ 
రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూట 9 గంటలు ఉచితంగా రానున్న 30 ఏళ్ల పాటు సరఫరా చేయాలనేది సీఎం జగన్‌ ధ్యేయం. డీబీటీ పథకం ద్వారా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా రైతులు తమ హక్కుగా విద్యుత్‌ పొందుతారని, విద్యుత్‌ వృధా తగ్గి ఆదా అవుతుందని సీఎం స్పష్టంగా చెప్పారు. దీంతో పథకం అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, కంపెనీ, ప్రభుత్వ కమిటీలంటూ క్షేత్రస్థాయి నుంచి, ప్రభుత్వస్థాయి వరకు వివిధ కమిటీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనలు, సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
–కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ 
శ్రీకాకుళం జిల్లాలో మోటార్లకు మీటర్లు అమర్చే పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. ఇక్కడి రైతులంతా మీటర్లకు తమ సంపూర్ణ మద్దతు తెలిపి, అంగీకారపత్రాలు కూడ ఇచ్చారు. మీటర్ల వల్ల విద్యుత్తు లోడ్‌ను ఎప్పటికప్పుడు సరిచూసి ఆమేరకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చు.
– కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌

డిస్కంలకు జవాబుదారీ తనం 
మీటర్ల ఏర్పాటు కోసం రూ. 1,200 కోట్ల వ్యయం అవుతుందనేది ప్రాథమిక అంచనా. ఈ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. నగదు బదిలీ విధానంలో రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు. వ్యవసాయ విద్యుత్‌కు వచ్చిన బిల్లు మొత్తాన్ని రైతుల బ్యాంకు ప్రత్యేక ఖాతాల్లో ప్రభుత్వమే జమచేస్తుంది. దాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. దీనివల్ల డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది.
– జె.పద్మజనార్ధనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్‌ 

మరిన్ని వార్తలు