స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు

27 Apr, 2022 07:36 IST|Sakshi

స్మార్ట్‌ ఫోన్ల వాడకం పతాకస్థాయికి చేరింది. మొబైల్‌ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అవసరానికి వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిసలవుతున్న వారు కెరీర్‌ను పాడు చేసుకుంటున్నారు. అపరిమిత వాడకం.. జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నెముక, కంటి తదితర సమస్యల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. 

సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్మార్ట్‌ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ట్రాయ్‌ (టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లా చిరునామాతో సిమ్‌ కార్డులు తీసుకున్న 8,01,456 మంది స్మార్ట్‌ఫోన్లు  వాడుతున్నట్లు తేలింది. ఏటా 10 నుంచి 15 శాతం  వరకు మొబైల్‌ఫోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి కాకుండా సాధారణ (కీప్యాడ్‌) ఫోన్లు మరో 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.   

నెలకు రూ.16 కోట్లు పైనే 
స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారు నెలకు సగటున రూ.200 వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారులు వివిధ మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు నెలకు కనిష్టంగా రూ.16 కోట్లు, ఏడాదికి రూ.192 కోట్లకు పైగా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. మిగతా సాధారణ ఫోన్లు కూడా కలిపితే ఏడాదికి రూ.250 కోట్లకు పైగా చార్జీల రూపంలో ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నట్టు సమాచారం. 

సగటున 2 గంటల సమయం వృథా 
స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న వారికి సగటున రోజుకు రెండు గంటల సమయం వృథా అవుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ ఇలా ఏదో ఒక యాప్‌ నుంచి ప్రయోజనం లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా యువకులు, పనిచేసే వారు ఇలా చేయడం వల్ల ఉత్పాదక రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలామంది విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు.  

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని.. 
గత ఏడాది డిసెంబర్‌లో ఉరవకొండ పట్టణంలో  రవినాయక్‌ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతకీ కారణమేంటంటే తల్లిదండ్రులు తనకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని. తన కొడుకు సెల్‌ఫోన్‌కు బానిస అయ్యాడని తల్లి కుళ్లాయమ్మ కన్నీరుమున్నీరవుతోంది. 

అలవాటు చేసినందుకు.. 
అనంతపురం నగరానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసులు, తనూష దంపతులకు మూడేళ్ల తేజాస్‌ అనే కుమారుడు ఉన్నాడు.       అన్నం తినడం లేదని కుమారుడికి సెల్‌ఫోన్‌ అలవాటు చేశారు. చివరకు ఆ సెల్‌ఫోన్‌కు బానిసైన చిన్నారి.. ఏడీహెచ్‌డీ (అటెన్షన్‌ డెఫిషిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌)కు గురయ్యాడు. ప్రస్తుతం కర్నూలులోని  ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.  

టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ 
తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం ఎక్కువ సేపు మొబైల్‌ వాడుతున్న వారిలో టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ (మెడ నొప్పి) లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సేపు మెడ వంచి మొబైల్‌ ఫోన్‌ మెసేజ్‌లు చదువుతున్నారు. గంటల తరబడి మెడ వంచి చూడటం వల్ల వెన్నెముక సమస్యలు కూడా వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మితిమీరి మొబైల్‌ఫోన్‌కు అలవాటు పడిన చిన్నారులకు రెటీనా (కంటి) సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు తేల్చాయి.  

అనర్థాలకు మూలం సెల్‌ఫోన్‌ 
అనేక అనర్థాలకు సెల్‌ఫోన్‌ వినియోగమే మూలం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెల్‌ఫోన్, వాట్సాప్, ఇంటర్‌నెట్‌ వినియోగాన్ని కూడా ఒక బానిసత్వంగా పరిగణించింది. వీటి వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ప్రధానంగా నిద్ర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. నిద్ర లేకపోవడంతో కోపతాపాలకు గురికావడం, ధ్యాస లోపించడం తోపాటు కంటి చూపు పూర్తిగా మందగిస్తోంది. చిన్న వయస్సులో నిషేధిత వెబ్‌సైట్లలోకి ప్రవేశించి పోర్న్‌ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. సర్వ అనర్థాలకు కారణం సెల్‌ఫోన్‌ అని ప్రధానంగా చెప్పవచ్చు.    –యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం  అధికమవుతున్న అనారోగ్య సమస్యలు

(చదవండి:  ప్రశాంత్‌ నీల్‌.. మన బంగారమే)
 

మరిన్ని వార్తలు